Technical Issues: బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్ కష్టాలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:42 AM
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోయిందంటారు. చెక్కుల సత్వర క్లియరెన్స్ కోసం ఈ నెల 4 నుంచి ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన....
కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తున్న సీటీఎస్
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన రూ.లక్షల కోట్ల లావాదేవీలు
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాకపోవటమే కారణమంటున్న బ్యాంకులు
న్యూఢిల్లీ: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోయిందంటారు. చెక్కుల సత్వర క్లియరెన్స్ కోసం ఈ నెల 4 నుంచి ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన చెక్ ట్రంకేషన్ సిస్టమ్(సీటీఎస్) పనితీరు ఇలానే ఉంది. నిన్న మొన్నటి వరకు బ్యాంకుల్లో చెక్ డిపాజిట్ చేస్తే రెండు రోజుల్లో క్లియరై ఖాతాదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేది. సీటీఎస్ విధానంతో అదే రోజు చెక్కులు క్లియరై.. డబ్బులు ఖాతాదారుల ఖాతాల్లో జమ అవుతాయని ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో ఖాతాదారులు తెగ సంబర పడిపోయారు. తీరా ఆచరణకు వచ్చే సరికి ఈ కొత్త విధానం అటు బ్యాంకర్లకు, ఇటు ఖాతాదారులకు చుక్కలు చూపిస్తోంది. సీటీఎస్ విధానం అమల్లోకి వచ్చి దాదాపు 10 రోజులు అవుతోంది. చెక్కుల క్లియరెన్స్ కాకపోవటంతో దేశవ్యాప్తంగా రూ.వేల కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. చెక్కులు జారీ చేసిన వారి ఖాతాల నుంచి నిధులు డెబిట్ అయినా.. చెక్కులు తీసుకున్న మా ఖాతాల్లో మాత్రం జమ కావడం లేదని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని బ్యాంకింగ్ ఖాతాదారులకూ ఈ తిప్పలు తప్పడం లేదు. బ్యాంకులు మాత్రం సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్ కాకపోవటంతో చెక్కుల క్లియరెన్స్ ఆలస్యమవుతోందని ఖాతాదారులకు ఎస్‌ఎంఎ్‌సలు పంపించి చేతులు దులుపుకుంటున్నాయి.
ఇదీ కొత్త విధానం
ఈ నెల 4 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానంలో సాధారణ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డిపాజిట్ అయిన చెక్కులను బ్యాంకులు వెంటనే స్కాన్ చేసి క్లియర్ చేయాలి. పేయింగ్ బ్యాంకులు కూడా చెల్లింపుల విషయాన్ని సాయంత్రం 7 గంటల కల్లా ధ్రువీకరించాలి. పేయింగ్ బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేకపోతే దాన్ని ఆటోమేటిక్ ఆమోదంగా భావిస్తారు. సీటీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా కేసుల్లో ఐదారు రోజులైనా చెక్కులు క్లియర్ కావడం లేదని ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు.
సాంకేతిక సమస్యలతోనే..
ఆయా బ్యాంకుల సాఫ్ట్‌వేర్, సీటీఎస్ వ్యవస్థతో సరిగా అనుసంధానం కాకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దీంతో చెక్ రీడబిలిటీ, పంచింగ్, కొన్ని కోట్స్, అంకెలును సీటీఎస్ వ్యవస్థ సరిగా చదవలేక పోతోంది. దీంతో ఆ చెక్కులపై ఉన్న వివరాలను ఒకటికి రెండుసార్లు ఫిజికల్‌గా చదివి మళ్లీ ప్రాసెస్ చేయాల్సి వస్తోంది. చెక్కుల క్లియరెన్స్ ఆలస్యం కావడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఈ సమస్యలతో కొన్ని వ్యాపార సంస్థలు ఖాతాదారుల నుంచి తమకు రావలసిన బకాయిలను నిఫ్ట్ లేదా ఆర్‌టీజీఎస్ ద్వారా రాబట్టుకుంటున్నాయి.
పూర్తి శిక్షణ లేకపోవడం
కొత్త విధానంలో చెక్కుల క్లియరెన్స్‌కు సంబంధించి బ్యాంకులు తమ సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఖాతాదారులు డిపాజిట్ చేసిన చెక్కులను బ్యాంకింగ్ సిబ్బంది చక్కగా స్కాన్ చేసి, డిజిటల్ ఇమేజీని అదే రోజు సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్‌కు పంపించలేక పోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇన్‌స్టాంట్ చెక్ క్లియరెన్స్, కోసం ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన సీటీఎస్ విధానం ఖాతాదారులకు చుక్కలు చూపిస్తోంది.