Share News

Technical Glitch Forces Emergency: ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు..

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:24 AM

కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ సహా పలువురు ఎంపీలతో పాటు 150 మందితో ఆదివారం రాత్రి కేరళలోని తిరువనంతపురం....

Technical Glitch Forces Emergency: ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు..

  • తిరువనంతపురం-ఢిల్లీ విమానంలో సాంకేతిక సమస్య

  • చెన్నైలో అత్యవసర ల్యాండింగ్‌.. ఆ సమయంలో రన్‌వేపై మరో విమానం

  • ప్రమాదం అంచుల వరకూ వెళ్లొచ్చాం: కాంగ్రెస్‌ ఎంపీ వేణుగోపాల్‌

చెన్నై, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ సహా పలువురు ఎంపీలతో పాటు 150 మందితో ఆదివారం రాత్రి కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పైలెట్‌ ఆ విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ప్రయాణికులందరినీ కిందకు దింపి వారికి తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. అనంతరం వారిని వేరొక విమానంలో ఢిల్లీకి పంపించారు. ఈ ఘనటపై కాంగ్రెస్‌ ఎంపీ వేణుగోపాల్‌ స్పందిస్తూ.. ‘ప్రమాదపు అంచుల వరకూ వెళ్లొచ్చాం’ అని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. తాము ప్రయాణించిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిందని చెప్పారు. అయితే ఈ విమానం ఆదివారం రాత్రి పది గంటలకే ఇక్కడ ల్యాండ్‌ కావాల్సి ఉండగా.. కంట్రోల్‌ రూమ్‌ అధికారులు వెంటనే అనుమతి జారీ చేయకపోవడం వల్ల చెన్నై గగనతలంలోనే గంటసేపు చక్కర్లు కొట్టాల్సి వచ్చిందన్నారు. ఇక ల్యాండింగ్‌ కోసం తమ విమానం రన్‌వేపై దిగుతుండగా అడ్డంగా మరో విమానం ఉందని, పైలెట్‌ ఆ విమానానికి అతి సమీప ఎత్తు నుంచి ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. అయితే చెన్నై ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. దీనిపై వేణుగోపాల్‌ స్పందిస్తూ తానేమీ అబద్ధం చెప్పలేదని, రన్‌వేకు అడ్డంగా విమానం కనిపించిందని, వెంటనే తమ విమానాన్ని కాస్త ఎత్తు పెంచి నడిపినట్లు పైలెటే తెలిపారని వివరించారు.

Updated Date - Aug 12 , 2025 | 06:24 AM