Governor RN Ravi : అసెంబ్లీ రూపొందించే అన్ని బిల్లుల్ని ఆమోదించాల్సిన అవసరం లేదు
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:33 AM
అసెంబ్లీ రూపొందించే అన్ని బిల్లుల్ని ఆమోదించాల్సిన అవసరం లేదని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి సుప్రీంకోర్టుకు వివరించారు. తమిళనాడు అసెంబ్లీ రూపొందించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకుండా బుట్టదాఖలు చేస్తున్నారని

సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి
చెన్నై, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ రూపొందించే అన్ని బిల్లుల్ని ఆమోదించాల్సిన అవసరం లేదని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి సుప్రీంకోర్టుకు వివరించారు. తమిళనాడు అసెంబ్లీ రూపొందించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకుండా బుట్టదాఖలు చేస్తున్నారని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. గవర్నర్ తరఫు న్యాయవాది ఈ మేరకు వాదించారు. గవర్నర్‌కు 4ముఖ్యమైన అధికారాలున్నాయని..., బిల్లులకు ఆమోదం, నిలిపివేయడం, తిరిగి పంపించడం, అసంతృప్తి తెలియజేయవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బిల్లుల్లో ఇరుపక్షాలకు అనుకూలమైన ప్రతిపాదనలు చేర్చడంపై గవర్నర్ పరిశీలన జరుపుతున్నారని, బిల్లులు ఆమోదం పొందకపోతే, ప్రభుత్వం- గవర్నర్ కలసి నిర్ణయం తీసుకొనేందుకు అనువుగా రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చని వివరించారు. అంతేగాక ఆ బిల్లులపై నిర్ణయం కోసం రాష్ట్రపతికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వమే గవర్నర్‌ను కోరవచ్చని, ఈ వ్యవహారాన్ని రాష్ట్ర హక్కులను హరించినట్టు భావించకూడదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎలాంటి వివరణ ఇవ్వకుండా బిల్లును తిప్పి పంపితే, ఆయన మనసులో ఏముందో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందని నిలదీసింది. సంబంధిత బిల్లును ఆమోదించడం కుదరదని గవర్నర్ ఎలా చెబుతారని ప్రశ్నించింది. 2023లో బిల్లులు రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పటి నుంచి ఇప్పటివరకు గవర్నర్ ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పాలని, మూడేళ్లుగా బిల్లుల్ని ఎలా పెండింగ్‌లో ఉంచుతారని ప్రశ్నించింది. గవర్నర్ ప్రభుత్వ పాలనకు అడ్డంకి కారాదని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.