Tamil Nadu: హిందీ పై మాటల యుద్ధం
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:20 AM
ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన నోరును అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుందని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ వ్యాఖ్యానించారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రధాన్
విద్యార్థులను నాశనం చేస్తున్న తమిళనాడు ప్రభుత్వం
మంత్రిది అహంకారపూరిత ధోరణి
తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శ
న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యా విధానంపై సోమవారం లోక్‌సభతో పాటు, బయట కూడా మాటల యుద్ధం కొనసాగింది. త్రిభాషా సూత్రం పేరుతో కేంద్రం బలవంతంగా హిందీని రుద్దతోందని తమిళనాడుకు చెందిన డీఎంకే ఆరోపించగా, తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని కేంద్రం ప్రత్యారోపణ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన నోరును అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుందని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ వ్యాఖ్యానించారు.
కావాలనే రాజకీయం చేస్తున్నారు: ప్రధాన్
తొలుత లోక్‌సభలో డీఎంకే ఎంపీలు జాతీయ విద్యా విధానం అంశాన్ని లేవనెత్తి కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సభను ప్రారంభించినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. డీఎంకే ఎంపీలు మరోసారి నిరసన తెలుపుతుండగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం శ్రీ (పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే నాశనం చేస్తోందని మండిపడ్డారు. హిందీ భాష అమలు అంశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజలను తప్పుతోవపట్టిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు ప్రభుత్వం ఈ అంశాన్ని ఉద్దేశ పూర్వకంగానే రాజకీయం చేస్తోందని, విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టాలని చూస్తోందని ఆరోపించారు. డీఎంకే అనాగరికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తమిళనాడు ప్రభుత్వం మొదట్లో నూతన విద్యా విధానం అమలుపై సంతకం చేయడానికి అంగీకరించిందని, కానీ ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. డీఎంకేలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగానే త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపయోగించిన మాటలపై డీఎంకే సభ్యులు అభ్యంతరం చెప్పగా స్పీకర్ వాటిని రికార్డుల నుంచి తొలగించారు. డీఎంకే సభ్యురాలు కనిమొళి.. మంత్రి ప్రధాన్‌పై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడుతామంటూ స్పీకర్‌కు నోటీసు అందజేశారు.
మేం ఎప్పుడూ ఒప్పుకోలేదు
డీఎంకే సభ్యులు కనిమొళి, దయానిధి మారన్‌లు మాట్లాడుతూ నూతన విద్యా విఽధానం, త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ఎప్పుడూ అంగీకరించలేదని తెలిపారు. ఉత్తరాది విద్యార్థులు కేవలం ఒక్క భాషను నేర్చుకుంటుండగా, తమిళనాడులో మూడు భాషలు ఎందుకు నేర్చుకోవాలని ప్రశ్నించారు. తాము హిందీకి వ్యతిరేకం కాదని చెప్పారు. ఆసక్తి ఉంటే విద్యార్థులు స్వచ్ఛందంగా నేర్చుకోవచ్చని, బలవంతంగా రుద్ద కూడదని స్పష్టం చేశారు. మంత్రి ప్రధాన్ వైఖరికి నిరసనగా డీఎంకే ఎంపీలు పార్లమెంటు బయట నిరసన తెలిపారు. తమిళనాడులో కూడా పలు చోట్ల నిరసనలు తెలిపారు.
కేంద్ర మంత్రి.. రాజునని భావిస్తున్నారు: స్టాలిన్
లోక్‌సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై స్టాలిన్ మండిపడ్డారు. ఎక్స్‌లో పోస్టు పెడుతూ ‘‘కేంద్ర విద్యా మంత్రి రాజునని అనుకుంటున్నారు. అహంకారంతో మాట్లాడుతున్నారు. క్రమశిక్షణలో ఉంచాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఆయన తమిళనాడు ప్రజలను అవమానపరుస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఇందుకు అంగీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. త్రిభాషా సూత్రాన్ని అంగీకరించకపోతే తమిళనాడు విద్యా రంగానికి ఇవ్వాల్సిన నిధులను నిలిపివేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘తమిళనాడు విద్యార్థుల కోసం ఉద్దేశించిన, మా నుంచి వసూలు చేసిన పన్నుల్లో భాగమైన నిధులను విడుదల చేస్తారా? లేదా? ఈ ఒక్కదానికి సమాధానం ఇవ్వండి’’ అని ప్రశ్నించారు. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా విధానం ఆరెస్సెస్ అజెండాయే తప్ప విద్యావిధానం కాదని తమిళనాడు విద్యా శాఖ మంత్రి అన్బిల్ అన్నారు.