CM Stalin: మరోసారి భాషా ఉద్యమానికి సిద్ధం
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:36 AM
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కుట్రలను తిప్పికొడతామన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఆధిపత్య ధోరణిని ప్రతిఘటించడం, మాతృభాషను కాపాడుకోవడం డీఎంకే కార్యకర్తల రక్తంలోనే ఉందన్నారు.

తమిళ ప్రజలపై హిందీని రుద్దితే ఒప్పుకోం..కుట్రను తిప్పికొడతాం
తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడుపై వేలాడుతున్న నియోజకవర్గాల
పునర్విభజన కత్తి.. 5న అఖిలపక్షం: స్టాలిన్
చెన్నై, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మరోసారి భాషా యుద్ధానికి తమిళనాడు సిద్ధమని, ప్రజలు అందుకు సిద్ధం కావాలని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కుట్రలను తిప్పికొడతామన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఆధిపత్య ధోరణిని ప్రతిఘటించడం, మాతృభాషను కాపాడుకోవడం డీఎంకే కార్యకర్తల రక్తంలోనే ఉందన్నారు. ఆ చైతన్యం తుదిశ్వాస వరకూ కొనసాగుతుందని అన్నారు. కేంద్రంలోని పాలకులు తమిళనాడులో హిందీని ఎలాగైనా అమలు చేయాలనే ప్రయత్నిస్తుంటారని, వాటిని డీఎంకే ఎప్పటికప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వస్తోందని చెప్పారు. తాజాగా కేంద్రం విద్యారంగానికి కేటాయించాల్సిన నిధులకు-జాతీయ విద్యావిధానం అమలుకు ముడిపెట్టిందని, త్రిభాషా విద్యావిధానాన్ని అమలు చేస్తేనే ఆ నిధులిస్తామంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ హిందీ వ్యతిరేకోద్యమం కోసం అంతా నడుం బిగించి సిద్ధంగా ఉండాలని స్టాలిన్ కోరారు. కాగా, 1965లో డీఎంకే నేతృత్వంలో హిందీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమం చేసింది.
మార్చి 5న అఖిలపక్ష సమావేశం
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో తమిళనాడులో 8 లోక్‌సభ స్థానాలను తగ్గించేలా కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించి దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దక్షిణ భారతదేశంపై నియోజకవర్గాల పునర్విభజన కత్తి వేలాడదీయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎంపీ సీట్ల సంఖ్యను తగ్గించకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడులో ఎంపీ సీట్లు 39 నుంచి 31కి పడిపోతాయని వివరించారు. మరోవైపు, జాతీయ విద్యా విధానంపై తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. కేంద్రం తీరును నిరసిస్తూ బీజేపీ నేత, నటి రంజనా నట్చియార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్రిభాషా పాలసీని రుద్దడమంటే ద్రవిడ భావజాలాన్ని వ్యతిరేకించడమేనని ఆమె ఎక్స్ వేదికగా విమర్శించారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News