Suspicious Boat: మహారాష్ట్ర తీరంలో అనుమానాస్పద బోటు.. హైఅలర్ట్
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:26 PM
కొర్లాయ్ తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఒక అనుమానాస్పద పడవను ఇండియన్ నేవీ రాడార్ ఆదివారం రాత్రి గుర్తుపట్టింది. ఇది పాకిస్థాన్ పడవ కావచ్చని, అయితే పడవను అడ్డుకుని అధీనంలోకి తీసుకున్న తర్వాతే దాని పూర్తి వివరాలు తెలుస్తాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా రేవ్‌దండలోని కొర్లాయ్ తీరం సమీపంలో ఒక అనుమానాస్పద పడవను గుర్తించారు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ పడవ పాకిస్థాన్‌కు చెందినది కావచ్చని అనుమానిస్తున్నారు. దీంతో రాయ్‌గఢ్ పోలీసులు, తీర ప్రాంత భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి.
కొర్లాయ్ తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఒక అనుమానాస్పద పడవను ఇండియన్ నేవీ రాడార్ ఆదివారం రాత్రి గుర్తుపట్టింది. ఇది పాకిస్థాన్ పడవ కావచ్చని, అయితే పడవను అడ్డుకుని అధీనంలోకి తీసుకున్న తర్వాతే దాని పూర్తి వివరాలు తెలుస్తాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, పడవ రాయ్‌గఢ్ తీరానికి కొట్టుకుని వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పడవను గుర్తించడంతో తీర ప్రాంతం వెంబడి గస్తీని పెంచారు. పడవ సమాచారం తెలిసిన వెంటనే రాయ్‌గఢ్ పోలీసులు, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్), తక్షణ స్పందన బృందం (క్యూఆర్‌టీ), నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది రాత్రికి రాత్రి ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే భారీ వర్షాలు, బలమైన గాలులు కారణంగా పడవ వద్దకు చేరడానికి ఆటంకం ఎదురవుతోందని రాయ్‌గఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆంచల్ దలాల్ తెలిపారు. ఆయనతో పాటు పోలీసులు అధికారులు తీరప్రాంతం వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను సైతం మెహరించారు.
ఈ ఘటన 26/దాడులను గుర్తు చేస్తుండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే తొయిబా ఉగ్ర ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు కొలాబా సముద్ర తీరం నుంచి ముంబైలోకి అప్పట్లో చొరబడ్డారు. బృందాలుగా విడిపోయి ముంబైలో 12 చోట్ల మూడు రోజుల పాటు సృష్టించిన మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
దలైలామాకు భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీల లేఖ
బాలికకు సీఎం యోగి హామీ.. లెక్కచెయ్యని స్కూలు యాజమాన్యం..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి