Share News

Gujarat: ఏ సీటు సురక్షితం!

ABN , Publish Date - Jun 15 , 2025 | 05:34 AM

గుజరాత్‌ విమాన ప్రమాదంలో 11ఏ సీటు ప్రయాణికుడొక్కరే ప్రాణాలతో బయటపడటంతో విమాన ప్రయాణాల్లో ఏ సీటు సురక్షితమనే చర్చ నిపుణుల్లో మొదలైంది.

Gujarat: ఏ సీటు సురక్షితం!

  • విమానయాన నిపుణుల్లో చర్చ

  • 11ఏ ప్రాణాలతో బయటపడటం అద్భుతమేనని వ్యాఖ్య

అహ్మదాబాద్‌, జూన్‌ 14: గుజరాత్‌ విమాన ప్రమాదంలో 11ఏ సీటు ప్రయాణికుడొక్కరే ప్రాణాలతో బయటపడటంతో విమాన ప్రయాణాల్లో ఏ సీటు సురక్షితమనే చర్చ నిపుణుల్లో మొదలైంది. విమానాల్లో ఇంకా ఏమైనా సురక్షితమైన సీట్లు ఉన్నాయా అని చర్చిస్తున్నారు. భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ పౌరుడు విశ్వాస్‌ కుమార్‌ రమే శ్‌ ఒక్కరే ఈ ప్రమాదం నుంచి సజీవంగా బయటపడిన విషయం తెలిసిందే. ఆయన కూర్చున్న 11ఏ సీటు అత్యవసర ద్వారానికి దగ్గరగా ఉంది. ‘స్టాటిస్టికల్‌గా విమానాల్లో సురక్షితమైన సీట్లు కొన్ని ఉన్నాయి. మధ్యలో ఉన్న సీట్ల కంటే చివరి సీట్లు, కుడివైపు ముందు వరస సీట్లు సురక్షితమని చాలా ఏళ్లుగా జరుగుతున్న విమాన ప్రమాదాల్లో తేలింది. అయితే, తాజా విమాన ప్రమాదంలో అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. 11ఏ సీటు విమానం మధ్యలో రెక్కకు ముందువైపు ఉంది.


ఈ సీటులోని ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటం అద్భుతమే’ అని విమానయాన నిపుణుడు అంగద్‌ సింగ్‌ చెప్పారు. కాగా, రమేశ్‌ కూర్చున్న 11ఏ సీటు బిజినెస్‌ క్యాబిన్‌కు వెనుకగా ఎకానమీ క్లాస్‌ మొదటి వరుసలో అత్యవసర ద్వారానికి దగ్గరగా ఉంది. విమానం కూలిపోగానే 11ఏ సీటుతోసహా ఎడమవైపు ముందుభాగం విరిగిపడగా, విమాన ప్రధాన భాగంలోని ఉన్నత శ్రేణి భాగాలన్నీ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అయితే తాను ఎడమవైపు ఉండటంతో బయటికి రాగలిగానని రమేశ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. విమానాల్లో సీట్ల కాన్ఫిగరేషన్లు వేర్వేరుగా ఉంటాయని, ప్రమాదాల్లో బయటపడటం విభిన్న అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 05:34 AM