Share News

Supreme Court: ఇప్పటికి వక్ఫ్‌ చట్టం రాజ్యాంగబద్ధమే

ABN , Publish Date - May 21 , 2025 | 02:47 AM

వక్ఫ్ సవరణ చట్టాన్ని తాత్కాలికంగా ఆపాలంటే బలమైన ఆధారాలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణపై పిటిషనర్లు వ్యతిరేకత వ్యక్తం చేయగా, వక్ఫ్ లౌకిక సంస్థ అని కేంద్రం సమర్థించింది.

Supreme Court: ఇప్పటికి వక్ఫ్‌ చట్టం రాజ్యాంగబద్ధమే

స్టే ఇవ్వాలంటే బలమైన కారణం చూపాల్సిందే సుప్రీంకోర్టు స్పష్టీకరణ

ఆస్తులను లాక్కోవడమే చట్టం ఉద్దేశం: సిబ్బల్‌

పారదర్శకత కోసమే బోర్డులో ఇతర మతస్థులు ప్రభుత్వ న్యాయవాది

న్యూఢిల్లీ, మే 20: బలమైన ఆధారాలతో పిటిషనర్లు సవాలు చేసే వరకు పార్లమెంటు చేసిన చట్టాలను రాజ్యాంగబద్ధమైనవి గానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్‌ సవరణ అమలు చేయకుండా మధ్యంతర ఊరట కల్పించాలంటే స్పష్టంగా ఉన్న బలమైన కారణాన్ని చూపించాల్సిందేనని పిటిషనర్లకు స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిలతో కూడిన ధర్మాసనం మంగళవారం వక్ఫ్‌ చట్టంపై దాఖలైన పలు పిటిషన్ల మీద విచారణ జరిపింది. కోర్టులు వక్ఫ్‌గా ప్రకటించినవి, భూమిని వినియోగిస్తున్న వారు వక్ఫ్‌గా ప్రకటించినవి, ఆస్తిని రాసివ్వడం ద్వారా వక్ఫ్‌గా ప్రకటించినవి... ఈ మూడు రకాల ఆస్తులను డీనోటిఫై చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టే ప్రస్తుత చట్ట నిబంధనను పిటిషనర్లు ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారు. చట్టాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేసిన వారి తరఫున కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. కొత్త చట్టంతో న్యాయ ప్రక్రియతో నిమిత్తం లేకుండా వక్ఫ్‌ ఆస్తులను లాక్కునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పథకం ప్రకారం వక్ఫ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకొనే కార్యక్రమమని సిబల్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారి ఆదేశాలతో వక్ఫ్‌ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించే పరిస్థితి నెలకొందని, బాధితులు కోర్టుల ద్వారా ఊరట పొందే అవకాశం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్‌ అంటే శాశ్వతంగా అల్లాకు సమర్పించే ఆస్తి అని, కొత్త చట్టం వల్ల శాశ్వతం అనే భావనకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు.


పాత వక్ఫ్‌ చట్టాలు ఆస్తులను కాపాడేందుకు ఉద్దేశించినవి అయితే ప్రస్తుత వక్ఫ్‌ చట్టం వాటిని లాక్కునేందుకు ఉద్దేశించినట్లు కనబడుతోందని వ్యాఖ్యానించారు. ఒక ఆస్తి వక్ఫ్‌దా? ప్రభుత్వానిదా? అని ప్రభుత్వ అధికారి విచారిస్తున్నపుడు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకొనే అధికారం కూడా సదరు అధికారికి కట్టబెడుతున్నారని ప్రస్తావించారు. ఇందులో ఎక్కడా కోర్టుల జోక్యానికి అవకాశం లేదని గుర్తు చేశారు. గతంలో వక్ఫ్‌కు ఎన్నికలు జరిగేవని, అందరూ ముస్లిములు ఉండేవారని, ఇప్పుడు అంతా నామినేటెడ్‌ సభ్యులని, 11 మందిలో ఏడుగురు ముస్లిమేతరులను నియమించే అవకాశం ఉందని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛకు, ప్రచారం చేసుకునే హక్కుకు భంగం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ఇద్దరే కదా అని ధర్మాసనం గుర్తు చేయగా, ఇద్దరైనా చాలా ఎక్కువేనని సిబల్‌ అన్నారు. హిందూ, సిక్కు ఎండోమెంట్‌ సంస్థల్లో మతేతరులు లేరని, ఎక్స్‌ అఫీషియో సభ్యులు కూడా అదే మతానికి చెందిన వారు ఉంటారని ప్రస్తావించారు.

వక్ఫ్‌ లౌకిక భావన

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. వక్ఫ్‌ పాలనలో లౌకిక అంశాలను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా లిఖితపూర్వకంగా కోర్టుకు చెప్పారు. వక్ఫ్‌ అనేదే మౌలికంగా లౌకిక భావన అన్నారు. చట్టంపై ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వాల్సిన జాతీయ అత్యవసర పరిస్థితి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. సరైన పత్రాలు లేకుండా వక్ఫ్‌ ఆస్తులను కొనసాగించే ప్రస్తావనే లేదని తుషార్‌ మెహతా స్పష్టం చేశారు. కోర్టు సొంత నిర్ణయంతో అలాంటి వాటికి గుర్తింపు ఇచ్చే ప్రయత్నంచేస్తే ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అందుకు అనుమతిస్తే చాలా మోసాలు జరుగుతాయన్నారు. ఆస్తిని మత ధర్మం కోసం వాడుతున్న వ్యక్తికి దాన్ని వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ప్రాథమిక హక్కేమీ కాదని స్పష్టం చేశారు. ఒక చట్టం ద్వారా ఇచ్చిన హక్కును మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మరో చట్టం ద్వారా తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తేల్చిచెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 02:47 AM