Share News

Suresh Productions: సురేశ్‌ ప్రొడక్షన్స్‌కు సుప్రీంలో చుక్కెదురు

ABN , Publish Date - May 03 , 2025 | 04:35 AM

విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు సురేశ్‌ ప్రొడక్షన్స్‌కు ఊరట ఇవ్వలేదు. షోకాజ్‌ నోటీసుపై స్థానికంగా విచారణ కోరుతూ, మధ్యంతర ఉపశమనం కూడా నిరాకరించింది.

Suresh Productions: సురేశ్‌ ప్రొడక్షన్స్‌కు సుప్రీంలో చుక్కెదురు

ఏపీ ప్రభుత్వ షోకాజ్‌ నోటీసుపై జోక్యానికి నో

మధ్యంతర ఉపశమనమూ ఇవ్వలేమని స్పష్టీకరణ

పిటిషన్‌ వెనక్కు తీసేసుకున్న సురేశ్‌ ప్రొడక్షన్స్‌

న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి) : విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సురేశ్‌ ప్రొడక్షన్స్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్‌ నోటీసుపై కలుగజేసుకోవాలని కోరుతూ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం కల్పించాలని కోరగా, అది కూడా కుదరదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఉమ్మడి ఏపీలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2003 సెప్టెంబరులో విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో రామానాయుడు స్టూడియోకు 34.44 ఎకరాలను కేటాయించింది. అప్పటి మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరా రూ.5.20 లక్షలు చొప్పున సురేశ్‌ ప్రొడక్షన్స్‌ చెల్లించింది. 2010 జనవరి 5న సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కన్వేయెన్స్‌ డీడ్‌ ఇచ్చి, హక్కు కల్పించింది. ఆ భూముల్లో సుమారు 10 ఎకరాల్లో స్టూడియో నిర్మాణాలు జరిగాయి. మిగిలిన భూమి ఖాళీగానే ఉంది. అయితే, వైసీపీ హయాంలో 2021 సెప్టెంబరులో స్టూడియో నిర్మాణానికి కేటాయించిన భూమిలో 15.17 ఎకరాల్లో లేఅవుట్‌కు అనుమతి కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేశారు. 2023 ఏప్రిల్‌లో ఇందుకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో స్టూడియో భూముల సమీపంలో బావికొండ బౌద్ధ ప్రాంతం ఉందని, లే అవుట్ల పేరుతో అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గతేడాది జనవరి 3న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


సినీ పరిశ్రమకు ఇచ్చిన భూములను స్టూడియో నిమిత్తమే ఉపయోగించాలని కోర్టు ఆదేశించింది. లే అవుట్‌ వేసి స్థిరాస్తి వ్యాపారం చేయడంపై 2024 ఫిబ్రవరి 9న స్టే ఇచ్చింది. ఈ క్రమంలోనే విశాఖలోని రామానాయుడు స్టూడియోకు సంబంధించిన భూముల్ని కేటాయించిన అవసరాల కోసం కాకుండా లేఅవుట్‌ వేసి స్థిరాస్తి వ్యాపారానికి ఉపయోగించడంపై కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది. 15.17 ఎకరాల భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో తెలియజేయాలని కోరుతూ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసును సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్లు శుక్రవారం జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘అన్ని ప్రభుత్వ అనుమతులూ తీసుకునే అక్కడ పనులు చేపట్టాం. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు.’’ అని తెలిపారు. మీరు షోకాజ్‌ నోటీసులకు సమాధానం ఇచ్చారా? అని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ప్రశ్నించారు. తాము షోకాజ్‌ నోటీసులను సవాల్‌ చేస్తున్నామని సింఘ్వి బదులిచ్చారు. అయితే.. షోకాజ్‌ నోటీసుపై కలగజేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. నోటీసు ఎక్కడ జారీ అయ్యిందో, అక్కడే తేల్చుకోవాలని సూచించింది. మధ్యంతర ఉపశమనం కల్పించాలని సింఘ్వీ కోరగా, అందుకు కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అవసరం అనుకుంటే, షోకాజ్‌ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ కోరగా, అందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు

Updated Date - May 03 , 2025 | 04:35 AM