Supreme Court: బెయిలిచ్చినా ఎందుకు విడుదల చేయలేదు?
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:22 AM
బలవంతంగా మత మార్పిడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై అరెస్టయిన వ్యక్తికి బెయిలు మంజూరు చేసినా జైలు నుంచి విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
బలవంతపు మత మార్పిడి కేసులో యూపీ అధికారులపై సుప్రీం ఆగ్రహం
బాధితుడికి 5 లక్షలు చెల్లించాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూన్ 25: బలవంతంగా మత మార్పిడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై అరెస్టయిన వ్యక్తికి బెయిలు మంజూరు చేసినా జైలు నుంచి విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. బాధితుడికి రూ.5లక్షలు పరిహారం చెల్లించాలంది. యూపీకి చెందిన అఫ్తాబ్ తనను పెళ్లి తర్వాత ఇస్లాం మతం స్వీకరించాలని బలవంతం చేశాడంటూ అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిహార్ తీసుకెళ్లి బలవంతంగా మతమార్పిడి చేశాడని ఆరోపించింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అఫ్తాబ్‌కు 2024 జూలైలో బెయిలు నిరాకరించింది. అయితే, తప్పుడు ఆరోపణలతో ఈ కేసులో తనను ఇరికించారని, తాను హిందూ మతం స్వీకరించానని అఫ్తాబ్ తెలిపారు.
ఆమె పూర్తి ఇష్టంతోనే తనతో వచ్చిందనీ పేర్కొన్నారు. కానీ, ప్రాసిక్యూషన్ మాత్రం అతను బలవంతంగా బిహార్ తీసుకెళ్లి, ఇస్లాం మతం స్వీకరించేలా చేసినట్లు ఆరోపించింది. దీంతో అఫ్తాబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌లు.. బాధితురాలు, నిందితుడిది పెద్దలు కుదిర్చిన వివాహం అని, హిందూ సంప్రదాయం ప్రకారమే వారి పెళ్లి కూడా జరిగిందన్న విషయాన్ని గుర్తుచేశారు. అఫ్తాబ్‌కు బెయిలు మంజూరు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 29న ఉత్తర్వులిచ్చారు. అయితే, జిల్లా జైలు అధికారులు అతన్ని విడుదల చేయలేదు. బెయిల్ ఉత్తర్వుల్లో సబ్ సెక్షన్ లేనందున అతన్ని విడుదల చేయబోమని చెప్పారు. దీనిపై అఫ్తాబ్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.