Share News

Supreme Court Questions: రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయకుంటే మీరే విచారణ చేపడతారా

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:19 AM

తమిళనాడులో మద్యం షాపు లైసెన్సుల స్కాంలో తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ ...

Supreme Court Questions: రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయకుంటే  మీరే విచారణ చేపడతారా

  • రాష్ట్రం హక్కును లాగేసుకుంటారా?

  • మరి సమాఖ్యవాదం మాటేమిటి?

  • తమిళనాడు లిక్కర్‌ లైసెన్సుల కేసులో ఈడీని నిలదీసిన సుప్రీంకోర్టు

  • దర్యాప్తుపై స్టే పొడిగింపు

న్యూఢిల్లీ, అక్టోబరు 14: తమిళనాడులో మద్యం షాపు లైసెన్సుల స్కాంలో తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ (టీఎన్‌ఎ్‌సఎంఏసీ) పాత్రపై దర్యాప్తు చేపట్టిన ఈడీకి సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ఒక నేరాన్ని రాష్ట్రప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదని మీరు అనుమానిస్తే.. మీరే వెళ్లి సొంతగా విచారణ చేపడతారా? ఇలాగైతే సమాఖ్యవాదం ఏముంటుంది? దర్యాప్తు హక్కు రాష్ట్రప్రభుత్వానిది. దానిని మీరే లాగేసుకోవడం లేదా’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఈడీని మంగళవారం నిలదీశారు. మద్యం షాపుల లైసెన్సుల స్కాంలో టీఏఎ్‌సఎంఏసీ అవకతవకలకు పాల్పడిందంటూ.. ఈడీ విచారణ చేపట్టింది. కార్పొరేషన్‌కు చెందిన పది కార్యాలయాల్లో ఈ ఏడాది మొదట్లో సోదాలు చేపట్టింది. లెక్కకు రాని రూ.వెయ్యి కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. దీనిని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. తమిళనాడు తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎ్‌సజీ) స్పందిస్తూ.. రాష్ట్రప్రభుత్వం 47 కేసులు పెట్టినా.. అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోందని.. అందుచేత ఈడీ దర్యాప్తు చేయొచ్చని అన్నారు. చీఫ్‌ జస్టిస్‌ జోక్యం చేసుకుని.. అలాగైతే సమాఖ్యవాదం పరిస్థితేంటని అడిగారు. చట్ట ఉల్లంఘన జరిగిందని దర్యాప్తు సందర్భంగా ఈడీ కనిపెడితే.. దానిని రాష్ట్రప్రభుత్వ దర్యాప్తు సంస్థతో పంచుకోవాలని పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 66(2) చెబుతోందని గుర్తుచేశారు. అనంతరం టీఏఎ్‌సఎంఏసీపై ఈడీ దర్యాప్తు, సోదాలు, వస్తువుల స్వాధీనంపై గతంలో విధించిన స్టే ఉత్తర్వులను ధర్మాసనం పొడిగించింది.

Updated Date - Oct 15 , 2025 | 04:19 AM