Share News

Supreme Court: అవినాశ్‌, జోగికి ముందస్తు బెయిల్‌

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:24 AM

జోగి రమేశ్‌ సహా నిందితులందరినీ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ ముగిసే వరకు దర్యాప్తు అధికారికి తెలియకుండా దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది.

Supreme Court: అవినాశ్‌, జోగికి ముందస్తు బెయిల్‌

దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు షరతు

బాబు నివాసం, టీడీపీ ఆఫీసుపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు

విచారణకు పూర్తిగా సహకరించాలి.. లేదంటే బెయిల్‌ రద్దే: ధర్మాసనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయం, సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని వైసీపీ నేతలు దేవినేని అవినాశ్‌, జోగి రమేశ్‌ సహా నిందితులందరినీ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ ముగిసే వరకు దర్యాప్తు అధికారికి తెలియకుండా దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారనే అభియోగంతో అవినాశ్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌.. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినందుకు జోగితో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును సెప్టెంబరు 9న అవినాశ్‌, అప్పిరెడ్డి, తలశిల, ఒగ్గు గవాస్కర్‌.. సెప్టెంబరు 10న జోగి రమేశ్‌ సహా మరికొందరు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్‌ సుధాంశు ధూలియా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌లూథ్రా.. అవినాశ్‌, జోగి తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, సిద్దార్థ దవేతోపాటు అల్లంకి రమేష్‌, పి.మోహిత్‌రావు హాజరయ్యారు.


తొలుత లూథ్రా వాదనలు వినిపిస్తూ... టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ను ధ్వంసం చేసిన ఘటనలో దేవినేని అవినాశ్‌ కీలక సూత్రధారి, పాత్రధారి అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పిస్తూ.. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఆదేశించిందని.. కానీ నిందితులు సహకరించడం లేదని తెలిపారు. అవినాశ్‌ దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారని, విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోకపోతే కచ్చితంగా వెళ్లిపోయేవారన్నారు. సిబల్‌ ఆయనతో విభేదించారు. దేశం విడిచి పారిపోవాలని అవినాశ్‌ ఎప్పుడూ ప్రయత్నించలేదని.. దేశంలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలని అనుకున్నారని చెప్పారు. ముందస్తు సమాచారం ఇవ్వాలని గత ఆదేశాల్లో ఉంది కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. అవినాశ్‌ అవగాహన లోపంతోనే అలా చేశారని, వేరే దేశానికి వెళ్లిపోవాలనే ఉద్దేశం లేదని సిబల్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలనే పట్టించుకోని వ్యక్తి దర్యాప్తునకు సహకరిస్తాడనే నమ్మకం లేదని, అతడికి కల్పించిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని లూథ్రా కోరారు.


దర్యాప్తులో భాగంగా మొబైల్‌ ఐఎంఈఐ నంబర్‌ ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా వంశీ ఇవ్వడం లేదని తెలిపారు. అయితే.. ఐఎంఈఐ ఎవరికి గుర్తుంటుంది.. మీ నంబర్‌ చెప్పగలరా అని జస్టిస్‌ ధూలియా ప్రశ్నించారు. టీడీపీ ఆఫీసుపై దాడికి అవినాశ్‌ వాట్సాప్‌లో ఆదేశాలు ఇచ్చారని, అవన్నీ బయటకు రావాలంటే ఆయన్ను కస్టడీలో విచారించాలని లూరఽథా కోరారు. నిందితులకు తాము తప్పు చేశామని తెలుసని, ప్రభుత్వం మారిన తర్వాత నిజం బయటికి వస్తుందనే భయంతో మూడేళ్ల తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తెలిపారు. సిబల్‌ జోక్యం చేసుకుని.. రాజకీయ దురుద్దేశంతోనే మూడేళ్ల తర్వాత ఇప్పుడు అరెస్టు చేస్తామంటున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 2021లో సాధారణ సెక్షన్లు ఉండేవని, 2024లో ప్రభుత్వం మారాక సెక్షన్‌ 307ను జతచేశారని, అందుకే బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

మూడేళు ఏం చేశారు?

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్య లు చేసింది. ఈ కేసుపై ఎందుకింత ప్రత్యేక శ్రద్ధపెట్టారని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దాదాపు మూడేళ్లుగా దర్యాప్తు జరపకుండా ఎందుకు తాత్సారం చేశారని అడిగింది. నిందితుల్లో ప్రతిఒక్కరూ పాస్‌పోర్టులు సరెండర్‌ చేయాలని, దర్యాప్తు అధికారి అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని షరతులు విధించింది. అవినాశ్‌, జోగి సహా మొత్తం 20మందికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఒకవేళ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు అవుతుందని ధర్మాసనం హెచ్చరించింది.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 05:24 AM