The Supreme Court has directed: కరూర్ ఘటనపై సీబీఐ దర్యాప్తు
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:21 AM
తమిళనాడులోని కరూర్‌లో గత నెల టీవీకే అధినేత విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు......
రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు
చెన్నై, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కరూర్‌లో గత నెల టీవీకే అధినేత విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఐజీ అస్రాగార్గ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘సిట్’, తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది. కరూర్‌లో గత సెప్టెంబరు 27వ తేదీ రాత్రి తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన రోడ్‌షోలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తు వివరాలు, సంబంధిత పత్రాలను తక్షణమే జస్టిస్ రస్తోగి కమిటీ, సీబీఐలకు అప్పగించాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును విజయ్ స్వాగతించారు. ‘న్యాయానిదే గెలుపు’ అంటూ ఏకవాక్యంతో ‘ఎక్స్’లో తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు.