Share News

Justice PV Sanjay Kumar: మరీ అలా నిజాలు చెప్పొద్దు!

ABN , Publish Date - May 29 , 2025 | 05:16 AM

మరీ నిజాయతీగా ఉంటే కష్టమని, పెద్దగా తప్పులేని చిన్న చిన్న అబద్ధాలు ఆడొచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ సరదాగా వ్యాఖ్యానించారు.

Justice PV Sanjay Kumar: మరీ అలా నిజాలు చెప్పొద్దు!

  • సుప్రీంకోర్టు జడ్జీల ఈగో దెబ్బతింటుంది

  • మెరిట్స్‌తో సంబంధం లేకుండానే మీ కేసు ముగిసిపోతుంది

  • చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు ఓ జూనియర్‌ లాయర్‌తో సుప్రీం జడ్జి

  • జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ సరదా వ్యాఖ్యలు

  • సీనియర్‌ లాయర్‌ మరో కోర్టులో బిజీగా ఉన్నారనడంపై న్యాయమూర్తి స్పందన

న్యూఢిల్లీ, మే 28: మరీ నిజాయతీగా ఉంటే కష్టమని, పెద్దగా తప్పులేని చిన్న చిన్న అబద్ధాలు ఆడొచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ సరదాగా వ్యాఖ్యానించారు. లేకుంటే జడ్జీల ఈగో దెబ్బతిని.. మీ కేసు కథ ముగిసిపోతుందని పేర్కొన్నారు. బుధవారం జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ఎదుట ఓ కేసు విచారణ ప్రారంభమైంది. ప్రతివాదుల తరఫు సీనియర్‌ న్యాయవాది ఇంకా రాలేదు. తమ కేసు విచారణను మిగతా కేసుల తర్వాత చేపట్టాలని సదరు న్యాయవాది వద్ద జూనియర్‌గా పనిచేసే లాయర్‌ ధర్మాసనాన్ని కోరారు. దీనితో ధర్మాసనం మిగతా కేసుల విచారణ పూర్తిచేసింది.


అప్పటికీ సదరు సీనియర్‌ న్యాయవాది రాలేదు. ఏమైందని ధర్మాసనం ప్ర శ్నించగా.. సీనియర్‌ న్యాయవాది హైకోర్టులో ఓ కేసు విషయంగా బిజీగా ఉన్నారని జూనియర్‌ లాయర్‌ సమాధానమిచ్చారు. దీనిపై జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ స్పందిస్తూ.. ‘‘మీరు మరీ ఇంత నిజాయతీగా ఉండొద్దు. మీ సీనియర్‌ హైకోర్టులో బిజీగా ఉన్నారని సుప్రీంకోర్టుకు ఎప్పుడూ చెప్పకూడదు. మా(సుప్రీంకోర్టు జడ్జీల) ఈగోలు చాలా సున్నితం. జడ్జి ఈగోను దెబ్బతీయవద్దు. మెరిట్స్‌తో సంబంధం లేకుండానే.. నేరుగా మీ కేసు ముగిసిపోతుంది. అందువల్ల ఇలాంటి నిజాలు చెప్పొద్దు. పెద్దగా తప్పు లేని చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ కూడా స్పందిస్తూ.. ‘‘మీ సీనియర్‌ న్యాయవాది మీకు ఈ విషయాలు నేర్పించి ఉండాల్సింది’’ అని అన్నారు.

Updated Date - May 30 , 2025 | 02:54 PM