CJI Gavai: హైకోర్టు జడ్జిల సామర్థ్యంపై సుప్రీం జడ్జిల కామెంట్లు వద్దు
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:14 AM
దిగువస్థాయి కోర్టుల న్యాయమూర్తుల సామర్థ్యం మీద ఉన్నతస్థాయి కోర్టుల జడ్జీలు వ్యాఖ్యలు చేయటం
హైకోర్టులు సుప్రీంకోర్టుకు సబార్డినేట్ కావు
పనితీరు మెరుగుదలకు అంతర్గతంగా సూచనలు చేయవచ్చు: సీజేఐ గవాయ్
న్యూఢిల్లీ, ఆగస్టు 11: దిగువస్థాయి కోర్టుల న్యాయమూర్తుల సామర్థ్యం మీద ఉన్నతస్థాయి కోర్టుల జడ్జీలు వ్యాఖ్యలు చేయటం సరైనది కాదని సీజేఐ జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఓ జడ్జిపై ఇటీవల సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు తీవ్ర అలజడి సృష్టించటం, ఆ వ్యాఖ్యల్ని సదరు ధర్మాసనం ఉపసంహరించుకోవటం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే, ఒక ఆంగ్లపత్రికతో సీజేఐ మాట్లాడుతూ.. ఈ స్పష్టతనిచ్చారు. ‘హైకోర్టులు సుప్రీంకోర్టుకు సబార్డినేట్ (దిగువస్థాయి) కావు. రెండూ కూడా రాజ్యాంగ కోర్టులే. హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సవరించవచ్చు. మెరుగుపర్చవచ్చు. మొత్తంగా పక్కన పెట్టవచ్చు. అంతే. ఒక హైకోర్టు న్యాయమూర్తి సామర్థ్యం, పనితీరు, పరిజ్ఞానంపై వ్యాఖ్యానించే అధికారం రాజ్యాంగం సుప్రీంకోర్టుకు ఇవ్వలేదు’ అని జస్టిస్ గవాయ్ వెల్లడించారు. ఇదే సూత్రం హైకోర్టు జడ్జీలకూ వర్తిస్తుందని, కింది స్థాయి కోర్టుల న్యాయాధికారుల మీద వారు కూడా కామెంట్లు చేయవద్దన్నారు. అయితే, పనితీరును ఎలా మెరుగుపర్చుకోవాలి? ఏ అంశాలపై దృష్టి సారించాలి? అన్నదానిని అంతర్గతంగా ఉన్న విధానాల ద్వారా దిగువ కోర్టుల జడ్జీలు, న్యాయమూర్తులకు తెలియజేయవచ్చన్నారు. ఇదిలా ఉండగా, ఆర్మీలోని న్యాయ విభాగంలో జడ్జి అడ్వకేట్ జనరల్ (జేఏజీ) పోస్టుల నియామకంలో మహిళలపై ఉన్న పరిమితులను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. జేఏజీ ఎంట్రీ స్కీంలో ఆరు పోస్టులను పురుషులకు, మూడింటిని మహిళలకు కేటాయిస్తూ భర్తీ ప్రక్రియను నిర్వహించగా అది సరైన విధానం కాదని తెలిపింది. సమానత్వం పాటించాలని, ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.