Supreme Court: మానసిక సమస్యలతో.. విద్యార్థుల ఆత్మహత్యలు!
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:41 AM
విద్యార్థుల ఆత్మహత్యలపై శుక్రవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భావిపౌరుల మరణాలు వ్యవస్థాపక వైఫల్యాలుగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం అభివర్ణించింది.
ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జూలై 26: విద్యార్థుల ఆత్మహత్యలపై శుక్రవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భావిపౌరుల మరణాలు వ్యవస్థాపక వైఫల్యాలుగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం అభివర్ణించింది. ఆత్మహత్యల నిరోధానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్‌సీఆర్‌బీ 2022లో ప్రచురించి ‘యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా’ నివేదికను ఉటంకిస్తూ.. చాలా దారుణమైన పరిస్థితులను గమనిస్తున్నామని వ్యాఖ్యానించింది. ‘‘మానసిక ఒత్తిడి, విద్యాభారం, సామాజిక వివక్ష, విద్యాసంస్థల తీరు వంటి కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది వ్యవస్థాపక వైఫల్యాన్ని సూచిస్తోంది’’ అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖపట్నంలో నీట్ అభ్యర్థి అయిన ఓ 17 ఏళ్ల యువతి ఆత్మహత్య కేసును సీబీఐకి బదలాయించాలన్న అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అప్పీల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని.. కోటా, జైపూర్, సీకార్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాల్లో ఇవి మరీ తీవ్రస్థాయిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆత్మహత్యల నివారణకు పలు సూచనలు చేసింది. ఆయా అంశాలను 90 రోజుల్లో అమలు చేసేలా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు సూచనలు
ప్రతి విద్యాసంస్థలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కౌన్సెలర్లను నియమించుకోవాలి
టెలీ-మానస్ టోల్‌ఫ్రీ సహా.. ఆత్మహత్యల నివారణకు హాస్టళ్లు, తరగతి గదుల వద్ద హెల్ప్‌లైన్ నంబర్లను ప్రదర్శించాలి
బోధన, బోధనేతర సిబ్బందికి కౌన్సెలింగ్‌లో శిక్షణనివ్వాలి. ఏటా రెండుసార్లు ఈ శిక్షణ ఉండాలి
విద్యార్థుల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు గమనించాలి. ఆత్మహత్య సంకేతాల(సూసైడల్ ఇంటెన్షన్)ను గుర్తించాలి
ర్యాగింగ్, లైంగిక వేధింపులపై తక్షణ చర్యలు తీసుకునేలా విద్యాసంస్థల్లో అంతర్గత కమిటీలు ఉండాలి
గురుకులాలు, హాస్టళ్ల వద్ద డ్రగ్స్ వినియోగం, వేధింపులపై నిఘా పెట్టాలి.