Share News

Supreme Court: నిందితుడు నిర్దోషిగా విడుదలైతే బాధితులు, వారి వారసులు సవాల్‌ చేయొచ్చు

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:19 AM

నిందితుడు నిర్దోషిగా విడుదలైనప్పుడు.. బాధితులు, వారి చట్టబద్ధ వారసులు కూడా సవాల్‌ చేయవచ్చని సుప్రీం కోర్టు ఓ కేసు తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: నిందితుడు నిర్దోషిగా విడుదలైతే బాధితులు, వారి వారసులు సవాల్‌ చేయొచ్చు

  • బాధితుల హక్కును పరిమితం చేయలేం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 25: నిందితుడు నిర్దోషిగా విడుదలైనప్పుడు.. బాధితులు, వారి చట్టబద్ధ వారసులు కూడా సవాల్‌ చేయవచ్చని సుప్రీం కోర్టు ఓ కేసు తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితుడి హక్కును దోషిగా నిర్ధారించిన నిందితుడి హక్కుతో సమానంగా ఉంచాలంటూ జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ కేవీ విశ్వనాథ్‌ ధర్మాసనం పేర్కొంది. ‘‘నిందితుడికి తక్కువ శిక్ష పడ్డప్పుడు, బాధితుడికి తగినంత నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించకపోయినా, నిందితుణ్ని నిర్దోషిగా విడిచిపెట్టినా.. ఆ తీర్పుపై అప్పీల్‌ చేయడానికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 372 నిబంధనల ప్రకారం బాధితుడికి హక్కు ఉంది’’ అని వెల్లడించింది. బాధితుల హక్కును పరిమితం చేయలేమని స్పష్టం చేసింది. అలాగే అప్పీల్‌ పెండింగ్‌లో ఉన్న సమయంలో బాధితుడు మరణిస్తే వారి చట్టబద్ధ వారసులు కూడా కేసును కొనసాగించవచ్చని తెలిపింది. క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఎలాంటి షరతులూ లేకుండా అప్పీలు చేసుకోవడానికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 374 ప్రకారం ఎలా హక్కు ఉందో.. బాధితులకు కూడా అప్పీలు చేసుకునే హక్కు ఉండాలని పేర్కొంది. బాధితులు ఫిర్యాదుదారా కాదా అనే దాంతో సంబంధం లేకుండా.. అప్పీలు చేసుకోవడానికి2009లో సీఆర్‌పీసీ సెక్షన్‌ 372లో ఓ నిబంధనను జోడించారని గుర్తు చేసింది.


ఆర్టికల్‌ 32 కింద మరణశిక్షనూ సవాల్‌ చేయొచ్చు..

మరణశిక్ష విధించిన కేసుల్లో నిందితులకు సంబంధించి విధానపర రక్షణ ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తేలితే రాజ్యాంగంలోని అధికరణం 32 ప్రకారం తిరిగి కేసు తెరవవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. మరణశిక్ష పడిన దోషి సైతం ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని స్పష్టం చేసింది. మరణశిక్ష పడిన ఓ దోషి పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది. 2008లో నాగ్‌పూర్‌కు చెందిన వసంత్‌ నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి మరణశిక్ష పడటంతో పలుమార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా అతడికి ఊరట దక్కింది.

Updated Date - Aug 26 , 2025 | 01:19 AM