Share News

Supreme Court: అతడి చేష్టను ఆమె నేరంగా చూడటం లేదు

ABN , Publish Date - May 24 , 2025 | 05:16 AM

పోక్సో కేసుకు సంబంఽధించి సుప్రీం కోర్టు శుక్రవారం అరుదైన తీర్పును వెలువరించింది. ఏడేళ్ల క్రితం 14 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొని, పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తిని సర్వోన్నత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది.

Supreme Court: అతడి చేష్టను ఆమె నేరంగా చూడటం లేదు

  • 14 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొన్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన సుప్రీం

న్యూఢిల్లీ, మే 23: పోక్సో కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు శుక్రవారం అరుదైన తీర్పును వెలువరించింది. ఏడేళ్ల క్రితం 14 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొని, పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తిని సర్వోన్నత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. పైగా ఈ కేసు అందరికీ ‘కనువిప్పు’ కావాలి అని తీర్పులో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘తనపట్ల నిందితుడు చేసిన పనిని బాధితురాలు నేరంగా పరిగణించడం లేదు. పైగా అతడితో ఆమె భావోద్వేగంతో కూడిన అనుబంధాన్ని పెంచుకొంది’ అని తీర్పులో వ్యాఖ్యానించింది. 2018లో 14 ఏళ్ల బాలికగా ఒకానొక రోజు ఆమె కనిపించకుండా పోయింది.


అదేరోజు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మర్నాడు.. ఆ బాలికను 25 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు తెలిసింది. దీనిపై స్థానిక కోర్టులో బాలిక కుటుంబసభ్యులు కేసు వేశారు. విచారణ చేసిన కోర్టు ఆ వ్యక్తికి పోక్సో చట్టం కింద దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు క్రమంగా సుప్రీంకోర్టును చేరింది. ‘బాధితురాలు ఇప్పుడు ఆ వ్యక్తి భార్య’ అని విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘తన భర్తను శిక్ష నుంచి కాపాడుకునేందుకు ఆమె పోరాటం చేస్తోంది. ప్రస్తుతం ఆ దంపతులకు బిడ్డ కూడా ఉంది. ఈ కేసులో నిందితుడికి శిక్ష విధిస్తే న్యాయం జరగదు. అలా చేస్తే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినట్లవుతుంది’’ అని పేర్కొంది.

Updated Date - May 24 , 2025 | 05:16 AM