Share News

Supreme Court: హైకోర్టులోనే తేల్చుకోండి

ABN , Publish Date - Oct 17 , 2025 | 05:48 AM

తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రస్తుతం కల్పించుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

Supreme Court: హైకోర్టులోనే తేల్చుకోండి

  • తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రస్తుతం కల్పించుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ టీ-ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేసేందుకు నిరాకరించింది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా తాము విచారణకు స్వీకరించలేమని, దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎ్‌సఎల్పీ)ని జస్టిస్‌ విక్రంనాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహ్రాతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. తాము తీసుకున్న ఈ నిర్ణయంతో హైకోర్టు విచారణ ప్రభావితం కావొద్దని, ఉచితానుచితాలపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఎన్నికలు నోటిఫై చేయడానికి ముందే రిజర్వేషన్లపై చట్టం ఎందుకు తీసుకురాలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారని సింఘ్వి వివరించారు. గవర్నర్‌ నిర్ణీతకాలంలో ఆమోదించకుంటే అనుమతి ఇచ్చినట్టే భావించాలన్న ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు మేరకు రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర పడినట్టేనని భావించామని తెలిపారు. మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటకూడదని సుప్రీం మార్గదర్శకాలు ఉన్నాయి కదా అని ధర్మాసనం ప్రస్తావించగా.. కచ్చితమైన డాటా ఉంటే పరిమితి దాటవచ్చని సుప్రీంకోర్టు పేర్కొందని సింఘ్వి వివరించారు. ప్రతివాది మధుసూదన్‌రెడ్డి తరఫున గోపాల్‌ శంకర్‌నారాయణ్‌ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సాధారణ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50శాతం పరిమితికి మించరాదని స్పష్టం చేసింది.

Updated Date - Oct 17 , 2025 | 06:11 AM