Share News

Supreme Court: బెట్టింగ్‌.. సమాజ వికృత క్రీడ

ABN , Publish Date - May 24 , 2025 | 05:14 AM

బెట్టింగ్‌ అనేది సమాజ వికృత క్రీడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా బెట్టింగ్‌లో పాల్గొనడాన్ని ఆపలేమని అభిప్రాయపడింది.

Supreme Court: బెట్టింగ్‌.. సమాజ వికృత క్రీడ

  • ఐపీఎల్‌ ముసుగులో బెట్టింగ్‌, జూదం

  • ప్రజలు పాల్గొనడాన్ని చట్టాలతో ఆపలేం

  • ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

  • యాప్‌లను నిషేధించాలంటూ కేఏ పాల్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ

  • స్వయంగా వాదనలు వినిపించిన పాల్‌

  • కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు

న్యూఢిల్లీ, మే 23(ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ అనేది సమాజ వికృత క్రీడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా బెట్టింగ్‌లో పాల్గొనడాన్ని ఆపలేమని అభిప్రాయపడింది. అన్ని ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లపై నిషేధం విధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మార్చి 26న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేఏ పాల్‌ స్వయంగా వాదనలు వినిపించారు. బెట్టింగ్‌ యాప్‌ల కారణంగా ఒక్క తెలంగాణలోనే గత రెండేళ్లలో 1,023 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 25మంది నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ స్వార్థం కోసం అమాయకుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆరోపించారు. బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘సచిన్‌ను క్రికెట్‌ దేవుడని అభిమానులు భావిస్తారు. అలాంటి వ్యక్తి ఆమోదిస్తే.. ఆ యాప్‌ సరైందేనని ప్రజలు అనుకుంటారు’’ అని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘బెట్టింగ్‌ను ఎలాగైనా ఆపాలి. ఈ విషయంలో కోర్టు మీతో ఉంది. అయితే, చట్టం ద్వారా బెట్టింగ్‌ ఆపవచ్చనే అపోహలో మీరున్నట్టు కనిపిస్తోంది. హత్య చేస్తే ఎంతో బలమైన చట్టాలు ఉన్నాయి. ఐపీసీ 302 కింద జీవిత ఖైదు నుంచి మరణ శిక్ష వరకు విధించే అవకాశం ఉంది. మరి హత్యలు చేయకుండా మీరు ఆపగలరా?’’ అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. కేఏ పాల్‌ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అవసరమైతే రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది.


మాతృత్వ సెలవులు ఇద్దరు పిల్లలకే కాదు

మాతృత్వ ప్రయోజనాల్లో సెలవులు కూడా ఓ భాగమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దానిని ఇద్దరు పిల్లలకే పరిమితం చేయూడదని సూచించింది. తనకు మొదటి వివాహం ద్వారా కలిగిన ఇద్దరు పిల్లల విషయంలో మాతృత్వ సెలవులు ఇచ్చారని, రెండో వివాహం ద్వారా కలిగిన సంతానానికి ఇవ్వలేదని పేర్కొంటూ తమిళనాడుకు చెందిన ఓ టీచరు చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు ఈ స్పష్టత ఇచ్చింది. సెలవులు పొందేందుకు పిల్లల సంఖ్య అడ్డం కాబోదని తెలిపింది.

Updated Date - May 24 , 2025 | 05:14 AM