తల్లిదండ్రులను సరిగ్గా చూడకుంటే.. గిఫ్ట్‌డీడ్ ఆస్తుల రద్దు: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jan 05 , 2025 | 02:28 AM
గిఫ్ట్‌డీడ్ కింద ఆస్తులను రాసిచ్చాక.. తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించి, వారి బాగోగులు చూడని బిడ్డల నుంచి ఆ ఆస్తులను తిరిగి పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, వృద్ధుల నిర్వహణ(పోషణ), సంక్షేమ చట్టం ఆ అధికారాన్ని ఇస్తుందని జస్టిస్ సి.టి.రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోల్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది.
న్యూఢిల్లీ, జనవరి 4: గిఫ్ట్‌డీడ్ కింద ఆస్తులను రాసిచ్చాక.. తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించి, వారి బాగోగులు చూడని బిడ్డల నుంచి ఆ ఆస్తులను తిరిగి పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, వృద్ధుల నిర్వహణ(పోషణ), సంక్షేమ చట్టం ఆ అధికారాన్ని ఇస్తుందని జస్టిస్ సి.టి.రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోల్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని చిత్తార్‌పూర్‌కు చెందిన వృద్ధ దంపతులు.. తమ కొడుక్కి కొంత ఆస్తిని గిఫ్ట్‌డీడ్ రూపంలో బదిలీ చేశారు. వారి బాగుగోలు చూసుకోని ఆ కొడుకు, మిగతా ఆస్తిని కూడా రాసివ్వాలంటూ దాడులు మొదలు పెట్టాడు. దీంతో ఆ వృద్ధ మహిళ తొలుత సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించి, న్యాయం పొందారు. మెజిస్ట్రేట్ ఆ గిఫ్ట్‌డీడ్‌ను రద్దుచేసి, ఆస్తిపై వృద్ధ దంపతుల హక్కులను పునరుద్ధరించారు. కొడుకు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లగా.. సింగిల్ బెంచ్ వద్ద వృద్ధ దంపతులకు న్యాయం జరిగినా.. డివిజన్ బెంచ్ మాత్రం గిఫ్డ్‌డీడ్ రద్దు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. దీంతో బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పైన పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం.. వృద్ధుల బాగోగులను పట్టించుకోని పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్‌డీడ్ దానంతట అదే(డీమ్డ్ టు బి) రద్దవుతుందని స్పష్టం చేసింది. గిఫ్ట్‌డీడ్ ద్వారా ఆ వృద్ధ దంపతులు తమ కుమారుడికి ఇచ్చిన ఆస్తిని, తిరిగి వారి పేరిట పునరుద్ధరించింది. వచ్చే నెలాఖరులోగా ఆస్తి బదలాయింపు జరగాలని ఆదేశాలు జారీ చేసింది.