Supreme Court: రాష్ట్రపతికి గడువు.. కేంద్రమే పెట్టింది
ABN , Publish Date - May 18 , 2025 | 05:00 AM
రాష్ట్ర బిల్లుల ఆమోదంలో జాప్యం నివారించేందుకు మూడు నెలల గడువు పాటించాలని 2016లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మెమోలు ఆధారంగా సుప్రీంకోర్టు తన తీర్పు ఇచ్చిందని తాజాగా వెల్లడైంది. ఇది కొత్త మార్గదర్శకాలు కావని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 201కు అనుగుణంగా కేంద్రం అప్పట్లోనే తగిన సూచనలు ఇచ్చిందని జస్టిస్ పార్ధివాలా స్పష్టం చేశారు.
2016లో 2 మెమోలు జారీ చేసిన హోంశాఖ
రాష్ట్రాల బిల్లుల మీద 3 నెలల్లోపు
ఆమోదం తెలుపాలని రాష్ట్రపతికి సూచన
ఇతర మంత్రిత్వశాఖలూ స్పందించాలని నిర్దేశం
జాప్యం నివారణకు అవసరమని స్పష్టీకరణ
ఆ మెమోలనే ప్రస్తావించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మే 17: రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లుల మీద గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు ఆమోదముద్ర వేయాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వటం మీద రాష్ట్రపతి తాజాగా ఆక్షేపణ తెలిపిన విషయం తెలిసిందే. అయితే, బిల్లుల ఆమోదం గడువు విషయంలో సుప్రీంకోర్టు కొత్తగా ఏమీ చెప్పలేదని, కేంద్రప్రభుత్వం గతంలో స్వయంగా విడుదల చేసిన కొన్ని అధికారిక ఉత్తర్వులనే ప్రస్తావించి, వాటిని అమలు చేయాలని నిర్దేశించిందని తాజాగా వెల్లడైంది. ప్రభుత్వ నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించటం కోసం.. బిల్లులను రాష్ట్రపతి మూడు నెలల్లోపు ఆమోదించాలని సూచిస్తూ కేంద్ర హోంశాఖ 2016లో రెండు మెమోలు జారీ చేసింది. తీర్పును వెలువరించిన సందర్భంగా జస్టిస్ జేబీ పార్ధివాలా వీటి గురించి ప్రస్తావిస్తూ.. ‘గవర్నర్ సిఫార్సు మేరకు అందిన బిల్లుల మీద మూడు నెలల్లోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొన్న గడువు సముచితమైనదేనని భావిస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ఈ మేరకు 2016 ఫిబ్రవరి 4వ తేదీన కేంద్ర హోంశాఖ జారీ చేసిన తొలి మెమోను సుప్రీంకోర్టు తన తీర్పులో ఉదహరించింది. ‘స్పష్టమైన నిబంధనలున్నప్పటికీ, రాష్ట్రాల బిల్లులకు సంబంధించి అనవసర జాప్యం జరుగుతోంది. దీనిని నివారించటానికి, రాష్ట్రాల నుంచి బిల్లు అందిన మూడు నెలల్లోపు తుది నిర్ణయం తీసుకోవాలి. దీనిని కచ్చితంగా పాటించాలి’ అని ఈ మెమో స్పష్టంగా పేర్కొనటం గమనార్హం. అంతేకాదు, రాష్ట్రాల నుంచి వచ్చిన బిల్లులలోని అంశాల ఆధారంగా సదరు బిల్లులను సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖలకు పంపటంలో కేంద్రహోంశాఖ మధ్యవర్తిగా వ్యవహరిస్తుందని, బిల్లులోని భాష, పదాల కూర్పు, రాజ్యాంగపరమైన ఆమోదాన్ని కలిగి ఉందా? అన్నవాటిని పరిశీలించటానికి కేంద్ర న్యాయశాఖకు పంపాలని ఆ మెమో పేర్కొంది. బిల్లును అందుకున్న మంత్రిత్వశాఖ 15 రోజుల్లోపు తన స్పందన హోంశాఖకు తెలియజేయాలని, జాప్యం జరిగితే అందుకు కారణాలు తెలపాలని స్పష్టం చేసింది. నెలలోపు ఎటువంటి స్పందన లేకపోతే, సదరు శాఖకు ఆ బిల్లు మీద అభ్యంతరాలు లేవని భావించాలని తెలిపింది.
నెలలోపు రాష్ట్రాలు వివరణ ఇవ్వాలి
2016 ఫిబ్రవరి 4వ తేదీనే కేంద్రహోంశాఖ జారీ చేసిన రెండో మెమోను కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ఉదహరించింది. బిల్లు మీద సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖకు ఏమైనా అభ్యంతరాలున్నా, మరిన్ని వివరాలు కావాలని భావించినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కచ్చితంగా తెలియజేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలు నెలలోపు వివరణ ఇవ్వాలని ఈ మెమో పేర్కొంది. నిర్ణయాత్మక ప్రక్రియలో ఉన్న వివిధ భాగస్వాములకు గడువు విధించటం అనేది.. రాజ్యాంగ విధులను నిర్దేశించే ఆర్టికల్ 201కు ఏ రకంగానూ విరుద్ధం కాదని జస్టిస్ పార్ధివాలా స్పష్టం చేశారు. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపిన బిల్లులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని గతంలో వచ్చిన సర్కారియా, పూంచీ కమిషన్లు చేసిన సిఫార్సులకు తగినట్లుగానే 2016లో కేంద్రం జారీ చేసిన మెమోలు ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..