జస్టిస్ బేలా త్రివేదికి వీడ్కోలు పలకని బార్
ABN , Publish Date - May 17 , 2025 | 04:55 AM
సుప్రీంకోర్టులో శుక్రవారం అసాధారణ దృశ్యం నెలకొంది. పదవీ విరమణ చేసిన మహిళా న్యాయమూర్తిని బార్ అసోసియేషన్ సంప్రదాయ రీతిలో వీడ్కోలు పలకకుండా బహిష్కరించింది.
న్యూఢిల్లీ, మే 16: సుప్రీంకోర్టులో శుక్రవారం అసాధారణ దృశ్యం నెలకొంది. పదవీ విరమణ చేసిన మహిళా న్యాయమూర్తిని బార్ అసోసియేషన్ సంప్రదాయ రీతిలో వీడ్కోలు పలకకుండా బహిష్కరించింది. ఈ చర్యను న్యాయమూర్తులు ఖండించారు. పదవీ విరమణ రోజున ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో ఆశీనులు కావడం సంప్రదాయంగా వస్తోంది. దాంతో ఆమె ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మాసి్‌హలధర్మాసనంలో కూర్చొన్నారు. సాయంత్రం సమయంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్లు వీడ్కోలు పలకడం మరో సంప్రదాయంగా వస్తోంది. వీడ్కోలు సమావేశంపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.
ఈ చర్యను ఖండించింది. చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్ మాట్లాడుతూ సంఘాలు వద్దన్నప్పటికీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్, ఉపాధ్యక్షురాలు రచనా శ్రీవాత్సవ ముగింపు రోజున జరిగే సంప్రదాయ ధర్మాసనం ముందుకు వచ్చారంటూ అభినందించారు. ఎవరూ వెళ్లవద్దని అసోసియేషన్లు తీర్మానాలు చేసినప్పటికీ వాటిని ధిక్కరించారని తెలిపారు. జడ్జి ఎలాంటి వారైనా కావచ్చుగానీ, సాయంత్రం 4.30 గంటల సమయంలో జరిగే కార్యక్రమాన్ని నిలిపివేయకూడదన్నారు.