Digital Arrest Fraud Cases: డిజిటల్ అరెస్టు కేసులు సీబీఐకి..
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:41 AM
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట చేస్తున్న నగదు మోసాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....
పాన్ ఇండియా స్థాయిలో ఒకేలా విచారణ.. దర్యాప్తు సంస్థను ఆదేశించిన సుప్రీంకోర్టు
ఎందుకు ఏఐ టెక్నాలజీని వాడటం లేదు?
ఆర్బీఐని ప్రశ్నించిన కోర్టు.. నోటీసు జారీ
సీబీఐని అనుమతించాలంటూ తెలంగాణ తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలకు నిర్దేశం
న్యూఢిల్లీ, డిసెంబరు 1: సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట చేస్తున్న నగదు మోసాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేసుల్లో పాన్ ఇండియా స్థాయిలో ఒకే తరహా దర్యాప్తు జరపాలని జాతీయ దర్యాప్తు సంస్థకు నిర్దేశించింది. సీబీఐని తమ రాష్ట్రాల్లోకి అనుమతించాలంటూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలను కోరింది. సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను గుర్తించి, స్తంభింపజేయడానికి ఏఐ సాంకేతికతను లేక మిషన్ లెర్నింగ్ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించడం లేదని రిజర్వు బ్యాంక్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారీచేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టుల వ్యవహారం కలకలం రేపుతోంది.
ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్టు వలలో చిక్కి, బాధితులుగా మారిన హరియాణాకు చెందిన వృద్ధ దంపతులు చేసిన ఫిర్యాదును సుమోటోగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన బెంచ్ స్వీకరించింది. ఎక్కువగా సీనియర్ సిటిజన్లపైనే సైబర్ నేరగాళ్లు కన్నేసి, వారు జీవితాంతం కష్టించి కూడబెట్టినదంతా దోచేస్తున్నారని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. డిజిటల్ అరెస్టులకు సంబంధించిన వివరాలు ఇవ్వడంతోపాటు, దీనిపై దర్యాప్తులో సీబీఐకి సహకరించాల్సిందిగా ఐటీ సంస్థలను కోర్టు కోరింది.
ట్యాక్స్ మినహాయింపులిచ్చే దేశాల్లో నక్కిన సైబర్ నేరగాళ్లను పట్టుకోవడంలో ఇంటర్‌పోల్ సహకారం తీసుకోవాలని సీబీఐకి సూచించింది. ఒక వినియోగదారుడికి ఒకటి కంటే ఎక్కువ సిమ్‌లను సర్వీస్ ప్రొవైడర్లు ఇస్తున్నారా అనేది నివేదించాలని టెలికం విభాగాన్ని ఆదేశించింది. సీబీఐ దర్యాప్తునకు అండగా తమ పరిధిలో సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలు, యూటీలను కోరింది. ఆన్‌లైన్ మోసాల కట్టడి గురించి కేంద్రం ఏం ఆలోచిస్తుందనేది తెలపాలని సొలిసిటర్ జనరల్‌ను కోరింది. సైబర్ నేరగాళ్లు వాడిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసే అధికారాన్ని సీబీఐతోపాటు రాష్ట్రాలు, యూటీలు, వాటి పోలీసు ఏజెన్సీలకు కోర్టు ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Opposition leader Kharge criticized the manner: రాజ్యసభలో ధన్‌ఖడ్ రగడ
Winter Session Parliament: పార్లమెంటులో నాటకాలొద్దు