Winter Session Parliament: పార్లమెంటులో నాటకాలొద్దు
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:48 AM
నాటకాలు వేయడానికి పార్లమెంటు వేదిక కాదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు ఉన్నది ఫలవంతమైన చర్చలతో ప్రజలకు సేవలందించడానికని చెప్పారు...
డ్రామాలకు బయట చాలా అవకాశాలున్నాయ్
వాటికి పార్లమెంటును వేదిక చేసుకోవద్దు
అభివృద్ధికి సహకరించండి.. బాధ్యతగా వ్యవహరించండి
నినాదాలపై కాదు.. విధానాలపై దృష్టి పెట్టండి
ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచన
ఎస్‌ఐఆర్‌పై రగిలిన పార్లమెంట్.. నేటికి వాయిదా
ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రధాని..ఆయన ప్రసంగమే పెద్ద డ్రామా: కాంగ్రెస్
న్యూఢిల్లీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నాటకాలు వేయడానికి పార్లమెంటు వేదిక కాదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు ఉన్నది ఫలవంతమైన చర్చలతో ప్రజలకు సేవలందించడానికని చెప్పారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విపక్షాలు చట్టసభలను ఎన్నికలకు సన్నద్ధమయ్యే వేదికగా మార్చుకుంటున్నాయని, ఓటముల తర్వాత ఎదురయ్యే అసహనాన్ని తగ్గించుకునే సాధనంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. ఉభయసభలు రాజకీయ డ్రామాలకు వేదిక కారాదన్నారు. నిర్మాణాత్మక, ఫలప్రదమైన చర్చలకు వేదిక కావాలని పేర్కొన్నారు. ‘‘డ్రామాలు వేసుకోవడానికి బయట చాలా అవకాశాలు ఉన్నాయి. అలా వేసుకునేవారు ఆ పనిని కొనసాగించండి. కానీ, పార్లమెంటు డ్రామాలకు వేదిక కాదు. ఇది ప్రజాసేవ చేసేందుకు వేదిక’’ అని మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘నినాదాలు చేసుకోవాలంటే దేశవ్యాప్తంగా చేసుకోండి. కానీ, పార్లమెంటులో మాత్రం విధానాలపై దృష్టి పెట్టండి, నినాదాలపై కాదు’’ అని ప్రతిపక్షాలకు ప్రధాని హితవు పలికారు. సభ్యులు అవసరమైన చోట నిర్మాణాత్మకమైన, కచ్చితమైన విమర్శలు చేయాలని సూచించారు. ఎన్నికల్లో పరాజయాల వల్ల కలిగిన అసహనాన్ని పార్లమెంటు కార్యకలాపాలపై చూపకూడదని రాజకీయ పార్టీలకు హితవు పలికారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయన ప్రసంగమే అతిపెద్ద డ్రామా అని ఖర్గే ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రజల సమస్యలను లేవనెత్తడం డ్రామా కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక అన్నారు. సమస్యలపై చర్చకు అనుమతించకపోవడమే డ్రామా అని ఆరోపించారు.
ఉభయసభల్లో గందరగోళం
దేశవ్యాప్తంగా సర్ నిర్వహణపై, ఢిల్లీ పేలుళ్లపై చర్చించాలని శీతాకాల సమావేశాల మొదటి రోజే ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. తీవ్ర గందరగోళం మధ్యనే ఆర్థిక మంత్రి నిర్మల పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై సుంకాలను పెంచేందుకు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు, ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతా సెస్ బిల్లులతో పాటు మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. మణిపూర్ జీఎస్టీ బిల్లును సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. జన విశ్వాస్ సవరణ బిల్లు, దివాలా, ఖాయిలా బిల్లులపై సెలెక్ట్ కమిటీ నివేదికలను కూడా ప్రవేశపెట్టిన తర్వాత సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. రాజ్యసభలో కూడా ఎస్‌ఐఆర్‌పై వాయిదా తీర్మానాన్ని చైర్మన్ రాధాకృష్ణన్ తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చే శారు. ఇదిలా ఉండగా, గత బడ్జెట్‌లో అంచనా వేసినదానికన్నా ఈ ఆర్థిక సంవత్సరం రూ.41వేల అదనపు వ్యయం కానుందని, దీనికి అనుమతించాలని కేంద్రప్రభుత్వం లోక్‌సభను కోరింది. మరోవైపు, పరారీలో ఉన్న 15 మంది ఆర్థిక నేరగాళ్లు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.58వేల కోట్లు బాకీ పడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంజక్ చౌదరి లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. బాకీలు చెల్లించాల్సిన వారిలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు ఉన్నారని చెప్పారు. వారు 12 బ్యాంకులకు రూ.58,082 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. వారి నుంచి ఇంతవరకు రూ.19,187 కోట్లు వసూలు చేసినట్టు చెప్పారు.
జీపీఎస్ స్పూఫింగ్ నిజమే
దేశంలోని వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్ జరిగింది నిజమేనని కేంద్రం అంగీకరించింది. ఢిల్లీ సహా ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, అమృత్‌సర్, బెంగళూరు, చెన్నైలోని విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్, జీఎన్‌ఎస్‌ఎ్‌స (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) మార్చేందుకు జోక్యం చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Opposition leader Kharge criticized the manner: రాజ్యసభలో ధన్‌ఖడ్ రగడ
Heavy Rainfall: ఉత్తర తమిళనాడును ముంచెత్తిన దిత్వా