Heavy Rainfall: ఉత్తర తమిళనాడును ముంచెత్తిన దిత్వా
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:39 AM
దిత్వా తుఫాను కారణంగా ఉత్తర తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని వర్షం కురిసింది.
చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వానలు
అండమాన్-చెన్నై విమాన సర్వీసులు రద్దు
వర్షాల కారణంగా మరో ఇద్దరు మృతి
చెన్నై, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘దిత్వా’ తుఫాను కారణంగా ఉత్తర తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని వర్షం కురిసింది. దీంతో చెన్నైతో పాటు ఆయా జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నైలోని ప్రధాన రోడ్లపై సైతం మోకాల్లోతున నీరు ప్రవహించింది. భారీ వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో పలు విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంది. అండమాన్-చెన్నై మధ్య తిరగాల్సిన నాలుగు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇక మెరీనా, పట్టినంబాక్కం తదితర బీచ్‌ల సమీపానికి ప్రజలు వెళ్లకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నాగపట్టణం, మైలాడుదురై, కారైక్కాల్ జిల్లాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 2.10 లక్షల ఎకరాల్లో సాంబ వరి, ఇతర పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇంటి గోడ కూలిన ఘటనలో నాగపట్టణం జిల్లాలో ఓ మహిళ, మైలాడుదురై జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మరణించారు. దీంతో వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది.