Share News

Supreme Court: హైవేపై సడన్‌ బ్రేక్‌ వేయడం నిర్లక్ష్యమే

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:15 AM

ఎలాంటి సిగ్నల్‌, హెచ్చరికలు లేకుండా హైవేపై సడన్‌గా బ్రేక్‌ వేయడం నిర్లక్ష్యం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court: హైవేపై సడన్‌ బ్రేక్‌ వేయడం నిర్లక్ష్యమే

న్యూఢిల్లీ, జూలై 30: ఎలాంటి సిగ్నల్‌, హెచ్చరికలు లేకుండా హైవేపై సడన్‌గా బ్రేక్‌ వేయడం నిర్లక్ష్యం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జరిగిన ప్రమాదానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. హైవేపై అందరూ వేగంగానే వెళ్తుంటారని, అలాంటి పరిస్థితుల్లో రోడ్డు మధ్యలో ఆకస్మికంగా బ్రేక్‌ వేయడం ప్రమాదానికి హేతువు అవుతుందని జస్టిస్‌ సుధాంశు ధులియా, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ల ధర్మాసనం మంగళవారం తెలిపింది. 2017 జనవరి 7న కోయంబత్తూర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి ఎస్‌.మహమ్మద్‌ హకీం మోటారు సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వెళ్తున్న కారుకు డ్రైవర్‌ సడన్‌ బ్రేకు వేయడంతో దానికి తగిలి కింద పడ్డాడు. ఇంతలో వెనుక నుంచి బస్సు రావడంతో దాని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో ఆయన ఎడమకాలును తొలగించాల్సి వచ్చింది. పరిహారం కోరుతూ ఆయన తొలుత మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ను, తర్వాత మద్రాసు హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు.. హైవేపై రోడ్డు మధ్యలో సడన్‌ బ్రేకు వేయడాన్ని ఏ కోణంలోనూ సమర్థించలేమని తెలిపింది. కారు డ్రైవర్‌ది 50%, బస్సు డ్రైవర్‌ది 30ు, బైకు నడిపిన విద్యార్థిది 20ు తప్పని వివరించింది. బీమా కంపెనీలు రూ.1.14 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని లెక్క కట్టింది. విద్యార్థిది 20ు మేర తప్పు ఉన్నందున అంత మేరకు పరిహారాన్ని తగ్గించి మిగిలిన సొమ్మును 4వారాల్లో చెల్లించాలని ఆదేశించింది.

Updated Date - Jul 31 , 2025 | 04:15 AM