Share News

Heart Disease Risk: రోజుకు 16 గంటల ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌తో.. హృద్రోగాల ముప్పు 135% ఎక్కువ

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:05 AM

ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ (ఐఎఫ్‌).. రోజులో 12 గంటల నుంచి 16 గంటలపాటు ఏమీ తినకుండా ఉండడం. ఏది తిన్నా మిగతా 8-12 గంటల సమయంలోపే తినడం. ఇటీవలికాలంలో చాలా మంది బరువు తగ్గడానికి అనుసరిస్తున్న పద్ధతి ఇది.

Heart Disease Risk: రోజుకు 16 గంటల ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌తో.. హృద్రోగాల ముప్పు 135% ఎక్కువ

  • తాజా అధ్యయనంలో వెల్లడి

ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ (ఐఎఫ్‌).. రోజులో 12 గంటల నుంచి 16 గంటలపాటు ఏమీ తినకుండా ఉండడం. ఏది తిన్నా మిగతా 8-12 గంటల సమయంలోపే తినడం. ఇటీవలికాలంలో చాలా మంది బరువు తగ్గడానికి అనుసరిస్తున్న పద్ధతి ఇది. ఈ పద్ధతిని అనుసరించేవారు సాయంత్రం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం అల్పాహార సమయం దాకా ఏమీ తినరు. కానీ.. ఇలా 16 గంటలపాటు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేసేవారు హృద్రోగంతో మరణించే ముప్పు.. 12-14 గంటల ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేసేవారితో పోలిస్తే 135ు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా.. అమెరికా జాతీయ ఆరోగ్య, పోషకాల పరిశీలన సర్వే (ఎన్‌హేన్స్‌) నుంచి సేకరించిన 19 వేల మంది వ్యక్తుల డేటాను పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేసినవారిలో ఎంత మంది క్యాన్సర్‌తో చనిపోయారు? ఇతరత్రా కారణాలతో ఎందరు మరణించారు? అనే విషయాలను పరిశీలించి.. తక్కువ సమయం ఐఎఫ్‌ చేసినవారితో పోలిస్తే రోజులో ఎక్కువ సమయం ఏమీ తినకుండా ఉండేవారు హృద్రోగాల బారిన ఎక్కువగా పడినట్టు గుర్తించారు. కాబట్టి ఈ విధానాన్ని దీర్ఘకాలం అనుసరించేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ సొంతంగా చేయకుండా.. వైద్యులను సంప్రదించి, వారి సలహాలు సూచనలను అనుసరించాలని పేర్కొన్నారు. గతంలో అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ చేసిన ఒక అధ్యయనంలో కూడా.. ఇలా రోజులో ఎక్కువ గంటలపాటు ఉపవాసం ఉండేవారు హృద్రోగాల బారిన పడే ముప్పు 91ు ఎక్కువని తేలినట్టు బెంగళూరుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ రంజన్‌ శెట్టి తెలిపారు. రోజులో కేవలం 8 గంటలపాటు మాత్రమే తినడం.. అరిత్మియా (హృదయ స్పందనలు సరిగా లేకపోవడం) వంటి సమస్యలతో బాధపడేవారికి మంచిది కాదని, 16 గంటలపాటు ఉపవాసం ఉండడం వల్ల వారి రక్తంలో చక్కెరస్థాయులు తగ్గి, గుండె దడ, హృదయస్పందన రేటు పెరగడం వంటి సమస్యలు వస్తాయని.. గుండెపోటు బారిన పడే ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు. ‘‘16 గంటలపాటు ఏమీ తినకుండా.. ఆ సమయంలో రోజువారీ పనులు చేసుకోవాలని భావిస్తే.. రక్తసరఫరా చేయడానికి గుండె ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది’’ అని ఆయన వివరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు,మధుమేహ బాధితులు,మూత్రపిండాలు, కాలేయం, గుండె జబ్బులున్నవారు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేయకూడదని సూచించారు. ఒకవేళ అలాంటివారు ఐఎఫ్‌ చేయాలన్నా.. వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Updated Date - Aug 26 , 2025 | 01:05 AM