Election Commission: మహిళల ఓట్లకు ఎసరు?
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:17 AM
బిహార్‌లో ఇటీవల ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన కార్యక్రమం(ఎ్‌సఐఆర్)లో చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన విభాగంలో పురుషుల ఓట్ల కన్నా మహిళల ఓట్లను ఎక్కువగా తొలగించినట్లు తేలింది.
ఊరి నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన క్యాటగిరీలో భారీగా మహిళల ఓట్ల తొలగింపు
వలస రాష్ట్రంలో ఓటరుగా నమోదయ్యారో లేదో చూడకుండా ఊళ్లో ఓటుకు ఎసరు
బిహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళనలో జరిగిందిదే
న్యూఢిల్లీ, ఆగస్టు 21: బిహార్‌లో ఇటీవల ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన కార్యక్రమం(ఎ్‌సఐఆర్)లో చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన విభాగంలో పురుషుల ఓట్ల కన్నా మహిళల ఓట్లను ఎక్కువగా తొలగించినట్లు తేలింది. 40 ఏళ్లకన్నా తక్కువ వయసు ఓటర్లలో ఈ పరిస్థితి ఉందని హిందూ పత్రిక నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్ ద్వారా తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను, కారణాలను ఎన్నికల సంఘం ప్రజలకు అందుబాటులో ఉంచింది. అత్యధికంగా ఓట్ల తొలగింపు జరిగిన తొమ్మిది నియోజకవర్గాల వివరాలను అధ్యయనం చేసిన హిందూ పత్రిక పలు సంచలన విషయాలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 1న సిద్ధం చేసిన ఓటర్ల జాబితా నుంచే కొత్తగా ఏడు లక్షల మహిళల ఓట్లను తొలగించినట్లు తెలిపింది. 18-39 మధ్య వయస్సులో చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన విభాగంలో పురుషుల కన్నా మహిళలను 2-3 రెట్లు ఎక్కువ మందిని తొలగించారు. ఇలా తొలగించిన వారు మొత్తం మీద మహిళలు 62.6 శాతం ఉంటే, పురుషులు 37.4 శాతం ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో మహిళల తొలగింపులు ఉన్నాయంటే వివాహం అయి, వేరే రాష్ట్రాలకు వెళ్లిన మహిళలను తొలగించి ఉంటారని భావిస్తున్నారు. కనిపించలేదు, మరణించారు, ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదయ్యారు అనే కారణాలతో తొలగించిన విషయంలో మహిళలు, పురుషుల మధ్య గణాంకాల్లో భారీ తేడా లేదు. అక్షరాస్యత తక్కువగా ఉండటం వల్ల మహిళలు ఎన్యూమరేషన్ ఫారాలు నింపకపోవడం వల్ల ఇలా జరిగిందని కూడా చెప్పడానికి లేదు. అక్షరాస్యత అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
పురుషుల ఓట్లను ఎప్పుడో తొలగించారా?
2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 38.5 లక్షల మంది పురుషులు, 36.02 లక్షల మంది మహిళలు వివాహం, ఉపాధి, కుటుంబం ఇతర కారణాలతో బిహార్ విడిచి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. స్త్రీ పురుషుల వలస విషయంలో అంతరం 14 ఏళ్లలో మరింత పెరిగి ఉండాలి. కానీ, మహిళల పేర్లే ఎక్కువగా చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన జాబితాలో ఉన్నాయి. ఎస్‌ఐఆర్ గణాంకాలు నిజమని నమ్మితే ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన బిహారీ పురుష ఓటర్లను గతంలోనే భారీ ఎత్తున తొలగించి ఉంటారని, మహిళలను ఇప్పుడు తొలగించి ఉంటారని భావించాల్సి వస్తుంది. వాళ్లు ఇతర రాష్ట్రాల్లో ఓట్లు పొందారో లేదో చూడకుండా ఓట్లు తొలగించి ఉండటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది.