Student Refuses Degree: గవర్నర్ ఆర్‌ఎన్ రవి.. తమిళనాడు వ్యతిరేకి
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:12 AM
ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ..
ఆయన నుంచి డిగ్రీ పట్టా స్వీకరణకు ఓ విద్యార్థిని విముఖత
చెన్నై, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ తమిళనాడులో ఓ విద్యార్థిని గవర్నర్ నుంచి డిగ్రీ స్వీకరించేందుకు నిరాకరించింది. పక్కనే ఉన్న యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకుంది. తిరునల్వేలిలో బుధవారం జరిగిన మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవానికి చాన్స్‌లర్ హోదాలో హాజరైన గవర్నర్ ఆర్‌ఎన్ రవి విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తుండగా, విద్యార్థులు వరుసగా సర్టిఫికెట్లు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నాగర్‌కోయిల్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని జీన్ రాజన్ మాత్రం గవర్నర్ నుంచి కాకుండా వీసీ నుంచి సర్టిఫికెట్ స్వీకరించింది. జీన్ రాజన్ తరువాత విలేకరులతో మాట్లాడుతూ.. గవర్నర్ ఆర్‌ఎన్ రవి తమిళనాడుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై అధికార డీఎంకే స్పందించింది. గవర్నర్ తీరు పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో తెలుసుకోవాలని సూచించింది.