Share News

Stampede at Tamil Nadu Vijays Rally: కన్నీటి కరూర్‌

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:21 AM

తమిళనాట పెను విషాదం చోటుచేసుకుంది. ఒక రాజకీయ సభ... మృత్యు వేదికగా మారింది. తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం టీవీకే అధ్యక్షుడు విజయ్‌ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మిక్కిలిగా జనం తరలివచ్చారు....

Stampede at Tamil Nadu Vijays Rally: కన్నీటి కరూర్‌

  • తొక్కిసలాటలో 38 మంది దుర్మరణం.. వందమందికి పైగా క్షతగాత్రులు

  • తమిళనాడు కరూర్‌లో టీవీకే ప్రచార సభ.. ఉదయం నుంచే జనం పడిగాపులు

  • నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చిన విజయ్‌.. ఇరుకు రోడ్డులో కిక్కిరిసిన జనం

  • సభ ముగియగానే అదుపుతప్పిన పరిస్థితి.. ఒకరిమీద ఒకరు పడి తొక్కిసలాట

  • హుటాహుటిన కరూర్‌ చేరుకున్న సీఎం స్టాలిన్‌.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ

చెన్నై, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తమిళనాట పెను విషాదం చోటుచేసుకుంది. ఒక రాజకీయ సభ... మృత్యు వేదికగా మారింది. తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మిక్కిలిగా జనం తరలివచ్చారు. దారులు మొత్తం కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పి... తొక్కిసలాటకు దారి తీసింది. అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... ఈ విషాదంలో 38 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు పిల్లలు, 17 మంది వరకు మహిళలు ఉన్నారు. 12మంది పరిస్థితి విషమంగా ఉందని... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. తమిళ నటుడు విజయ్‌ టీవీకే పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. గత మూడు వారాలుగా ప్రతి శని, ఆదివారాల్లో ‘ర్యాలీ’లు నిర్వహిస్తున్నారు. శనివారం... నామక్కల్‌, కరూర్‌లో సభలు ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు నామక్కల్‌ రావాల్సిన విజయ్‌... మూడు గంటలు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 3 గంటలకు కరూర్‌లోని వేలుచామిపురం వద్దకు విజయ్‌ వస్తారని నిర్వాహకులు ప్రకటించారు. కానీ... ఉదయం 11 గంటల నుంచే కరూర్‌ వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన (కథా)నాయకుడిని చూసేందుకు యువకులతోపాటు... పిల్లలు, మహిళలూ భారీగా తరలి వచ్చారు. ఎండ మండిపోతున్నా లెక్క చేయకుండా గంటలకొద్దీ వేచి చూశారు. చివరికి... నాలుగు గంటలు ఆలస్యంగా రాత్రి 7 గంటల తర్వాత విజయ్‌ అక్కడికి చేరుకున్నారు. తన సభల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బస్సు పైకి ఎక్కి విజయ్‌ ప్రసంగం ప్రారంభించగానే... అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ఆయన ప్రసంగం ముగియడానికి కొద్దిసేపటి ముందే తొక్కిసలాట మొదలైంది. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అప్పటికే నీరసించిన జనంలో కొందరు స్పృహతప్పి పడిపోయారు.

8.jpg


ఇది గమనించిన విజయ్‌ టీమ్‌ అప్రమత్తమైంది. విజయ్‌ కూడా తన ప్రసంగాన్ని ఆపివేసి... బస్సు పైనుంచే వాటర్‌ బాటిళ్లు విసిరేశారు. విజయ్‌ అక్కడి నుంచి బస్సులో బయలుదేరగానే... పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఉదయం నుంచి ఎండలో ఉండి... మాడిపోయిన జనం ఒక్కసారిగా అక్కడి నుంచి కదిలారు. విజయ్‌ని స్పష్టంగా చూడాలని గోడలు, చెట్లు ఎక్కిన వాళ్లు కిందికి దూకారు. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. అసలే ఇరుకు రోడ్డు... చీకటి... అటు జన ప్రవాహం, ఇటు ఒకరిమీద ఒకరు పడటంతో తొక్కిసలాట మొదలైంది. పెను విషాదానికి ఇదే కారణమైంది.

హాహాకారాలు... ఆర్తనాదాలు

తొక్కిసలాట సమయంలో పోలీసులూ అసహాయులుగా మారిపోయారు. పరిస్థితిని అదుపులోకి తేవడం వారికి అసాధ్యంగా మారింది. చీకట్లో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. తొక్కిసలాటలో చిక్కుకున్న జనం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయారు. ‘సాయం చేయండి... ప్లీజ్‌... పోలీస్‌’ అంటూ ఆర్తనాదాలు చేశారు. చాలామంది అక్కడే స్పృహ కోల్పోయారు. దారులన్నీ జనసంద్రంగా మారడంతో అంబులెన్స్‌లు కూడా వేగంగా చేరుకోలేకపోయాయి.

కన్నీటి సంద్రంలా కరూర్‌ ప్రభుత్వాస్పత్రి

క్షతగాత్రులను తరలించేందుకు సమారు 50 అంబులెన్స్‌లను ఉపయోగించారు. క్షతగాత్రులు, మృతదేహాలు, బాధిత కుటుంబీకుల రోదనలతో కరూర్‌ ప్రభుత్వాసుపత్రి శోకసముద్రంలా మారింది. ఒక్కో అంబులెన్సులో నలుగురైదుగురు క్షతగాత్రులను కూడా తీసుకొచ్చారు. ఇక్కడ 80 మందికి పైగా క్షతగాత్రులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది క్షతగాత్రులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.

విచారణకు ఆదేశం...

ఈ విషాదంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ సచివాలయంలో ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున అందిస్తామని ప్రకటించారు. అలాగే... ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించారు. ఆదివారం ఉదయం కరూర్‌ వెళ్లాలని భావించినప్పటికీ... శనివారం రాత్రికే ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్నారు. జరిగిన విషాదంపై విచారణకు ఆదేశించారు. ఇక... స్టాలిన్‌ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తన దుబాయ్‌ పర్యటనను రద్దు చేసుకుని, విమానాశ్రయం నుంచి నేరుగా కరూర్‌ చేరుకున్నారు.


నా గుండె బద్దలైంది: విజయ్‌

కరూర్‌ నుంచి తిరుచ్చి విమానాశ్రయం చేరుకున్న నటుడు విజయ్‌.. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నా గుండె బద్దలైపోయింది. భరించలేని బాధతో విలవిలలాడుతున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని విజయ్‌ పేర్కొన్నారు.

ప్రముఖుల దిగ్ర్భాంతి

కరూర్‌ విషాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, తమిళనాడు గవర్నర్‌ రవి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తదితర ప్రముఖులు కూడా బాధితులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

అదుపు చేయలేకనే.. విషాదాలు

ఫిబ్రవరిలో ఢిల్లీలోని రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు.. జూన్‌లో బెంగళూరులో ఆర్సీబీ జట్టు ఐపీఎల్‌ విజయోత్సవ కార్యక్రమం నేపథ్యంలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు.. ఇప్పుడు తమిళనాడులో విజయ్‌ రాజకీయ సభలో తొక్కిసలాటలో 38 మంది వరకు మృతి చెందారు.. వీటన్నింటికీ కారణం తక్కువ స్థలంలో ఎక్కువ మంది గుమిగూడటం, ఎవరికి వారు తామే ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నించడం.. అన్నింటికన్నా ముఖ్యంగా గుంపును కట్టడి (క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌) చేయలేకపోవడమే. మన దేశంలో రైల్వేస్టేషన్లు, బస్టాండులు, మార్కెట్లు, సినిమా హాళ్లు వంటివి ఎప్పుడూ కిక్కిరిసే కనిపిస్తాయి. ఇక జాతరలు, వేడుకల సమయంలో జనం గుమిగూడటమూ సాధారణమే. దానికితోడు సినీ నటుల కార్యక్రమాలు, రాజకీయ సభలు, ర్యాలీలకు భారీగా జనం పోటెత్తుతుంటారు. అలాంటి చోట్ల తొక్కిసలాట జరగకుండా జనాన్ని కట్టడి చేయడమే కీలకం. తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం నుంచి ఆధునిక సాంకేతికతను వినియోగించడం దాకా ఇందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వరల్డ్‌ రీసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఇండియా నివేదిక ప్రకారం.. ఏ ప్రదేశంలోనైనా ప్రతి చదరపు మీటరుకు నలుగురు వ్యక్తులు ఉంటే అది కిక్కిరిసిన పరిస్థితి. అదే ఆరుగురి చొప్పున ఉంటే ప్రమాదకర పరిస్థితి. తొక్కిసలాటకు అవకాశం ఎక్కువ.


ప్రస్తుతం హెచ్‌డీ కెమెరాలు, అవి చిత్రీకరించే దృశ్యాల ఆధారంగా గుమిగూడిన జనం పరిస్థితిని విశ్లేషించే సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ ఎక్కువ జనం గుమిగూడారు? గుంపులో జనం ఎటువైపు కదులుతున్నారు? తొక్కిసలాట జరిగే పరిస్థితి నెలకొందా? అన్నది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. జనాన్ని నియంత్రించేలా, మరోవైపు మళ్లించేలా క్షేత్రస్థాయిలోని సిబ్బందిని సూచనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక భారీగా గుమిగూడిన జనం మధ్య అక్కడక్కడా ఖాళీ ప్రదేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని.. ఏదైనా ఇబ్బంది ఏర్పడితే తొక్కిసలాట జరగకుండా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జనం గుమిగూడిన ప్రాంతానికి సినీ నటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు వస్తే.. వారిని చూడటానికి అంతా ఒక్కసారిగా ఎగబడి తొక్కిసలాటకు దారితీస్తుంది. అలాంటి సమయంలో కచ్చితమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టేలా కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. జనం కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడితే ముందుగానే జాగ్రత్తపడేలా ప్రజల్లో అవగాహన కల్పించడమూ కీలకం.

ప్రభంజనం... ఆంక్షలు... వివాదాలు!

ప్రేక్షకులకు, ప్రజలకు విజయ్‌గా సుపరిచితుడైన ఆయన పూర్తి పేరు... జోసెఫ్‌ విజయ్‌ చంద్రశేఖర్‌! తమిళనాట ‘ఇలయ దళపతి’గా పేరు తెచ్చుకున్నారు. తమిళనాట విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం పెను సంచలనం సృష్టించింది. గత ఏడాది ‘తమిళ వెట్రి కళగం’ (తమిళ విజయం పార్టీ) ఏర్పాటు చేశారు. అక్టోబరు 27న విల్లుపురంలో తొలి రాజకీయ సభకు భారీగా జనం తరలి వచ్చారు. ఆ తర్వాత... నిర్వహించిన సభల్లోనూ ఇదే పరిస్థితి. సభలకు వచ్చే జనాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. దీంతో విజయ్‌ ప్రచారానికి పలు నిబంధనలు విధించారు. అయితే దీనిని సవాల్‌ చేస్తూ ఆయన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం పోలీసుల నిబంధనల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, అన్ని పార్టీల నేతల ప్రచారానికి ఒకే విధమైన నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది.

1.jpg5.jpg4.jpg3.jpg6.jpg

Updated Date - Sep 28 , 2025 | 01:21 AM