Share News

Sri Lankan Woman: ప్రేమికుడి కోసం...శ్రీలంక నుంచి ప్లాస్టిక్‌ పడవలో ధనుష్కోటికి

ABN , Publish Date - Aug 14 , 2025 | 03:24 AM

ప్రేమించిన వ్యక్తి కోసం శ్రీలంక నుంచి భారత్‌కు ఓ ప్లాస్టిక్‌ పడవలో వచ్చిందో యువతి. ఒంటిపై నగలను తెగనమ్మి ఓ..

Sri Lankan Woman: ప్రేమికుడి కోసం...శ్రీలంక నుంచి ప్లాస్టిక్‌ పడవలో ధనుష్కోటికి

  • జాలరికి డబ్బులు ఇచ్చి వచ్చిన యువతి

  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • శ్రీలంక శరణార్థుల శిబిరానికి తర లింపు

చెన్నై, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రేమించిన వ్యక్తి కోసం శ్రీలంక నుంచి భారత్‌కు ఓ ప్లాస్టిక్‌ పడవలో వచ్చిందో యువతి. ఒంటిపై నగలను తెగనమ్మి ఓ జాలరి సాయంతో ధనుష్కోటికి చేరుకుంది. కానీ ఎటుపోవాలో తెలియక తచ్చాడుతుండడతో స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు....మంగళవారం వేకువజామున రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి అరిచ్చల్‌మునై ప్రాంతం వద్ద ఓ యువతి ఒంటరిగా సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆ యువతి శ్రీలంక మన్నార్‌ ఆండకుళం ప్రాంతానికి చెందిన విదుర్షియా (25)గా గుర్తించారు. గతంలో తమిళనాడులోని పళని శ్రీలంక శరణార్థుల శిబిరంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న విదుర్షియా.. స్థానికంగా ఓ యువకుడితో ప్రేమలో పడింది. తర్వాత కుటుంబంతో కలిసి గత ఏడాది శ్రీలంక వెళ్లిపోయింది. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా మళ్లీ భారత్‌కు వచ్చేందుకు ఆమెకు వీసా లభించలేదు. దీంతో ఓ జాలరిని ఆశ్రయించింది. అతను భారత్‌ తీరానికి చేర్చేందుకు రూ.2 లక్షలు అడగడంతో తన ఒంటిపై ఉన్న నగల్ని తెగనమ్మి అతనికి ఇచ్చింది. అనంతరం అతను ఏర్పాటు చేసిన ఓ సాధారణ ప్లాస్టిక్‌ పడవలో సోమవారం రాత్రి బయలుదేరింది. ధనుష్కోటి తీరంలో ఆమెను దింపిన అనంతరం ఆ జాలరి వెనుదిరిగివెళ్లిపోయాడు. అనంతరం ఎక్కడికెళ్లాలో, ఎలా వెళ్లాలో తెలియక విదుర్షియా తీరంలో తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆమెను రామేశ్వరం సమీపంలోని మండపం శ్రీలంక శరణార్థుల శిబిరానికి తరలించారు.

Updated Date - Aug 14 , 2025 | 03:24 AM