Cancer Research: ఆ ఎంజైమ్‌ను అడ్డుకుంటే క్యాన్సర్‌కు చెక్!
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:21 AM
ఆ ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా.. క్యాన్సర్ కణాలు తిరిగి సాధారణ కణాలుగా మారుతాయని ప్రయోగశాలలో వారు చేసిన పరిశోధనల్లో తేలింది! మానవాళికి పెనుముప్పుగా మారిన క్యాన్సర్ మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు సాగిస్తున్న పోరులో కీలక మైలురాయిగా నిలిచిపోయే ప్రయోగమిది.

కీలక ఎంజైమ్‌ను గుర్తించిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు
దాన్ని నిరోధిస్తే క్యాన్సర్ కణాలు తిరిగి సాధారణ స్థితికి
క్యాన్సర్ పరిశోధనల్లో కీలక మైలురాయి
సోల్, ఫిబ్రవరి 11: శరీరంలో ఉండే ఆరోగ్యవంతమైన కణాలు.. క్యాన్సర్ కణాలుగా మారకుండా ఆపే ప్రక్రియను నిరోధించే ఒక ఎంజైమ్‌ను దక్షిణ కొరియా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఆ ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా.. క్యాన్సర్ కణాలు తిరిగి సాధారణ కణాలుగా మారుతాయని ప్రయోగశాలలో వారు చేసిన పరిశోధనల్లో తేలింది! మానవాళికి పెనుముప్పుగా మారిన క్యాన్సర్ మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు సాగిస్తున్న పోరులో కీలక మైలురాయిగా నిలిచిపోయే ప్రయోగమిది. శరీరంలో క్యాన్సర్ కణాలు తొలగించడానికి శస్త్రచికిత్స, కీమో థెరపీ, రేడియేషన్, ఇమ్యూనోథెరపీ అందుబాటులోకి ఉన్నాయి. వీటివల్ల కొన్ని దుష్ప్రభావాలున్నా వాటివల్ల కలిగే మేలే ఎక్కువ కాబట్టి వైద్యనిపుణులు ఈ చికిత్సలను చేస్తూ వస్తున్నారు. అయితే, దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు దీనికి భిన్నంగా ఆలోచించారు. సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారాక చికిత్స చేసే కంటే.. అసలు అవి ఎందుకు క్యాన్సర్ కణాలుగా మారుతున్నాయో గుర్తించి, అలా మారకుండా అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. పెద్దపేగు క్యాన్సర్‌కు సంబంధించిన కణాలను సేకరించి.. వాటితో ప్రయోగశాలలో చిన్నచిన్న కణితులను అభివృద్ధి చేశారు. సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారేలా చేసే ప్రొటీన్లను నాశనం చేసే వ్యవస్థ పనిచేయకుండా అడ్డుకుంటున్న ఎంజైమ్‌ను గుర్తించారు. తాము ల్యాబ్‌లో పెంచిన ఆర్గనాయిడ్లలో ఆ ఎంజైమ్‌ను నిరోధించారు. అంతే.. ఆ క్యాన్సర్ కణాల (ఆర్గనాయిడ్ల) పెరుగుదల ఆగడమే కాక, అవి మళ్లీ సాధారణ కణాలుగా మారాయని వారు వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రయోగాల దశలో ఉన్న ఈ చికిత్స భవిష్యత్తులో క్యాన్సర్ ట్రీట్‌మెంట్ గతినే మార్చేస్తుందని అమెరికాకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్ టిఫనీ ట్రోసో శాండోవల్ తెలిపారు.