Train Accident: రైలు కింద పడి ఆరుగురి దుర్మరణం
ABN , Publish Date - Nov 06 , 2025 | 06:47 AM
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. రైల్లోంచి దిగిన ప్రయాణికుల్లో కొందరు, రాంగ్ సైడ్ నుంచి పట్టాలను దాటేందుకు ప్రయత్నిస్తూ ఆ వైపు దూసుకొచ్చిన మరో రైలు కింద నలిగిపోయారు.
యూపీలోని చునార్ రైల్వే స్టేషన్‌లో ఘటన
మిర్జాపూర్, నవంబరు 5: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. రైల్లోంచి దిగిన ప్రయాణికుల్లో కొందరు, రాంగ్ సైడ్ నుంచి పట్టాలను దాటేందుకు ప్రయత్నిస్తూ ఆ వైపు దూసుకొచ్చిన మరో రైలు కింద నలిగిపోయారు. మిర్జాపూర్ జిల్లాలోని చునార్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. మృతులంతా మహిళలే! వారిలో ఇద్దరు బాలికలున్నారు. ఉదయం 9:30కు స్టేషన్‌లోని నాలుగో నంబరు ప్లాట్‌ఫాంపై చోపన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. చునార్ సమీపంలోని గంగానదిలో కార్తీక స్నానాలు చేసేందుకు మీర్జాపూర్ నుంచి బయలుదేరిన యాత్రికులు ఆ రైల్లోంచి కిందకు దిగారు. అక్కడి నుంచి బయటకొచ్చేందుకు ప్రయాణికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులో ఉన్నా కొందరు నేరుగా పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో హౌరా నుంచి కల్కాజీ వెళుతున్న నేతాజీ ఎక్స్‌ప్రెస్ రైలు యాత్రికుల మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సవిత (28), సాధన (16), శివకుమారి (12), అంజూదేవి (20) సుశీలాదేవి (60), కళావతి (50) మృతిచెందారు.