Share News

Law And Order: తగవు తీర్చేందుకు వెళ్లిన ఎస్‌ఐనే చంపేశారు

ABN , Publish Date - Aug 07 , 2025 | 06:04 AM

తండ్రీకొడుకుల మధ్య తగవు తీర్చేందుకు వెళ్లిన ఎస్‌ఐపై ఆ తండ్రీకొడుకులే ఎదురుతిరిగారు.

Law And Order: తగవు తీర్చేందుకు వెళ్లిన ఎస్‌ఐనే చంపేశారు

  • తండ్రీకొడుకుల మధ్య తగాదాలో ఘటన

చెన్నై, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): తండ్రీకొడుకుల మధ్య తగవు తీర్చేందుకు వెళ్లిన ఎస్‌ఐపై ఆ తండ్రీకొడుకులే ఎదురుతిరిగారు. తమ మధ్య ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. వివరాలివీ.. మడత్తుకుళం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్‌కు చెందిన మామిడితోటలో పనిచేస్తున్న తండ్రీకొడుకులు ఘర్షణ పడుతున్నారంటూ మంగళవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పెట్రోలింగ్‌లో ఉన్న అళంగియ దళవాయ్‌పట్టినం ప్రాంతానికి చెందిన స్పెషల్‌ ఎస్‌ఐ షణ్ముగవేల్‌ (57) డ్రైవర్‌ అళగురాజాను తీసుకుని హూటాహూటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ తోటలో పని చేసే మూర్తి, అతడి కుమారుడు తంగపాండ్యన్‌ తాగిన మైకంలో కర్రలతో కొట్టుకుంటూ కనిపించారు. ఈ ఘటనలో మూర్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరినీ షణ్ముగవేల్‌ విడదీసి.. మూర్తిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో తంగపాండ్యన్‌ వేటకొడవలిలో షణ్ముగవేల్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. మూర్తి సైతం తన కొడుక్కి అండగా నిలిచి, షణ్ముగవేల్‌పై దాడికి తెగబడ్డాడు. అడ్డుకునేందుకు యత్నించిన జీపు డ్రైవర్‌పైనా దాడిచేశారు. దీంతో అతడు పారిపోయి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులకు రక్తపుమడుగులో పడిఉన్న షణ్ముగవేల్‌ మృతదేహం కనిపించింది. తండ్రీకొడుకులు పారిపోయారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

లొంగిపోయిన తండ్రీకొడుకులు

ఎస్‌ఐను హతమార్చిన మూర్తి, అతడి కొడుకు తంగపాండ్యన్‌తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మణికంఠన్‌ అనే మరో వ్యక్తి బుధవారం సాయంత్రం తిరుప్పూరు డీఎస్పీ కార్యాయంలో లొంగిపోయారు. ఎస్‌ఐ షణ్ముగవేల్‌ భౌతికకాయానికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కాగా, ఎస్‌ఐ హత్య జరిగింది ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎమ్మెల్యే తోట కావడంతో ఈ వ్యవహారంపై అధికార పార్టీ తీవ్రంగా స్పందించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతూ.. ఆ తప్పును తమపై వేసేందుకు ప్రయత్నిస్తోందని డీఎంకే ఆరోపించగా, సాక్షాత్తు పోలీసు అధికారే హత్యకు గురయ్యారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏమేరకు ఉన్నాయో ప్రజలు గ్రహిస్తున్నారని అన్నాడీఎంకే దుయ్యబట్టింది. కాగా, షణ్ముగవేల్‌ హత్యకు గురికావటంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

Updated Date - Aug 07 , 2025 | 06:04 AM