Share News

Shubanshu Shukla: గగన్‌యాన్‌కు ‘శుభ’ సంకల్పం!

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:13 AM

సుమారు 40 ఏళ్ల క్రితం భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ రష్యా రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఆక్సియం స్పేస్‌క్రా్‌ఫ్టలో అంతరిక్షంలోకి వెళ్లారు.

Shubanshu Shukla: గగన్‌యాన్‌కు ‘శుభ’ సంకల్పం!

  • శుభాన్షు శుక్లా అంతరిక్ష పర్యటన కోసం

  • భారత్‌కు ఖర్చు సుమారు రూ.500 కోట్లు!

  • ఈ వ్యయానికి మించి భవిష్యత్‌ ప్రయోజనాలు

న్యూఢిల్లీ, జూన్‌ 25: సుమారు 40 ఏళ్ల క్రితం భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ రష్యా రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఆక్సియం స్పేస్‌క్రా్‌ఫ్టలో అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితి చాలా విభిన్నం. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగిస్తే చాలు అనుకునే దశ నాడు ఉంటే... నేడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సొంతంగా అంతరిక్షంలోకి మనుషులను పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్లా అంతరిక్ష పర్యటన, పరిశోధనల కోసం భారత్‌కు అవుతున్న ఖర్చు సుమారు రూ.500 కోట్ల (ఆరు కోట్ల డాలర్లు) వరకు ఉంటుందని అంచనా. ఈ ఖర్చు పెద్దగానే కనిపిస్తున్నా.. మన దేశం అంతరిక్ష ప్రయోగాలపై పెట్టుకున్న పెద్ద కలలెన్నో నెరవేర్చేందుకు మార్గం సుగమం చేయనుంది.


ప్రతి అడుగు.. అంతరిక్షం వైపు..

అతి తక్కువ వ్యయంతో వ్యయంతో విజయవంతంగా అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశంగా భారత్‌కు పేరుంది. భారత్‌ 1975లో ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట కోసం అయిన ఖర్చు రూ.3 కోట్లు. అదే 2019లో చంద్రయాన్‌-2 కోసం అయిన వ్యయం సుమారు రూ.978 కోట్లు. అదే చంద్రయాన్‌-3 ప్రాజెక్టును రూ.613 కోట్లతోనే విజయవంతంగా పూర్తి చేయగలిగాం. అంతేకాదు ఒక హాలీవుడ్‌ సినిమా తీయడానికి అయ్యే ఖర్చుకన్నా తక్కువ వ్యయంతోనే అంగారకుడి వద్దకు ఉపగ్రహాన్ని పంపగలిగాం. ప్రపంచంలోనే మొదటిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంలో రోవర్‌ను ల్యాండ్‌ చేయగలిగాం. అంతరిక్షంలోకి మనుషులను పంపే ‘గగన్‌యాన్‌’ ప్రయోగానికి సిద్ధమవుతున్నాం. ముగ్గురు వ్యోమగాములతో మూడు రోజుల పాటు భూమి చుట్టూ చక్కర్లు కొట్టే ఈ ప్రయోగాన్ని వచ్చే రెండేళ్లలో చేపట్టేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. భవిష్యత్తులో భారత సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని, ఇందుకోసం 2028లో మొదటి మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపాలని భావిస్తోంది.


అంతేకాదు చంద్రుడిపై కాలుమోపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అధిక వ్యయంతోపాటు ఎంతో క్లిష్టమైన, సమర్థవంతమైన సాంకేతికత అవసరం. ఆ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నా.. అమల్లో అనుభవం అత్యంత కీలకం. ప్రస్తుతం శుభాంశు శుక్లా ద్వారా ఇస్రోకు ఈ సామర్థ్యం సమకూరనుంది. రోదసిలోకి వెళ్లేప్పుడు, తిరిగి వచ్చేప్పుడు, ఐఎ్‌సఎ్‌సలో ఉన్న సమయంలో శుక్లా స్వయంగా ఎదుర్కొనే పరిస్థితులు, ఆయన చేసే ప్రయోగాలు, వీటన్నింటికి సంబంధించిన సమగ్ర డేటా ఇస్రో చేతికి అందుతుంది. తదనుగుణంగా సొంత ప్రయోగాలకు అవసరమైన సాంకేతికత అభివృద్ధి, మార్పు చేర్పులకు వీలవుతుందని అంతరిక్ష రంగ నిపుణులు చెబుతున్నారు. అంటే అంతరిక్షంలో శుక్లా వేసే ప్రతి అడుగు మన ఇస్రో ముందడుగుకు మార్గం సుగమం చేస్తుందని.. ఆయన అంతరిక్ష పర్యటన కోసం భారత్‌ చేస్తున్నది ఖర్చు కాదు.. పెట్టుబడి అని స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Jun 26 , 2025 | 06:13 AM