Shocking Survey: ఈ కాలం పిల్లల్లో.. లెక్కలు, ఎక్కాలు తెల్వనోళ్లే ఎక్కువ
ABN , Publish Date - Jul 09 , 2025 | 02:33 AM
దేశంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల్లో ఎక్కువ మంది లెక్కలు.. ఎక్కాలు తెల్వనోళ్లే నని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది.
ఆరోతరగతిలో ఉన్నా 53% మందికే 10 వరకు ఎక్కాలు తెలుసు
మూడో తరగతిలో 45% మందికి ఆరోహణ, అవరోహణ క్రమాలు తెలియవు
కేంద్ర విద్యాశాఖ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 7: దేశంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల్లో ఎక్కువ మంది ‘లెక్కలు.. ఎక్కాలు తెల్వనోళ్లే’నని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. మూడో తరగతి విద్యార్థుల్లో 45% మందికి 99 వరకు ఉన్న అంకెల్లో ఆరోహణ, అవరోహణ క్రమాలను గుర్తించే శక్తి లేదు. ఆరోతరగతి విద్యార్థుల్లో 10 వరకు ఎక్కాలు వచ్చిన వారు 53ు మందే కావడం గమనార్హం..! తొమ్మిదో తరగతిలో కూడా.. గణిత ప్రక్రియల పరస్పర సంబంధాలు, వాటిని అన్వయించడంపై కేవలం 53% మందికే అవగాహన ఉందనే కఠోర సత్యం ఈ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది డిసెంబరు 4న కేంద్ర విద్యాశాఖ పరిధిలోని.. విద్యావ్యవస్థ పనితీరు, సమీక్ష, విశ్లేషణ - సమగ్రాభివృద్ధి(పరాఖ్) రాష్ట్రీయ సర్వేక్షణ్ ఈ సర్వేను నిర్వహించింది. దేశంలోని 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 781 జిల్లాలకు చెందిన 74,229 ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 21,15,022 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
సర్వేలో వెల్లడైన అంశాలు..
మూడో తరగతిలో 55% మంది విద్యార్థులు మాత్రమే 0 నుంచి 99 వరకు ఉన్న అంకెలు/సంఖ్యలను ఆరోహణ, అవరోహణ క్రమాల్లో అమర్చగలుగుతున్నారు.
ఇదే తరగతికి చెందిన 58% మంది విద్యార్థులు మాత్రమే రెండంకెల సంఖ్యలను కూడడం, తీసివేయడం చేయగలుగుతున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు వెనకబడి ఉన్నారు.
ఆరోతరగతి విద్యార్థుల్లో 53% మంది మాత్రమే 10 వరకు ఎక్కాలను చెప్పగలుగుతున్నారు. ఈ తరగతిలో ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది.
తొమ్మిదో తరగతిలో 53% మంది విద్యార్థులకే గణిత ప్రక్రియల పరస్పర సంబంధం, వాటిని ఇచ్చిన లెక్కల్లో అన్వయించడంపై అవగాహన ఉంది.
తొమ్మిదో తరగతి విద్యార్థుల్లో.. కేంద్ర ప్రభుత్వ బడులకు చెందిన వారు అత్యుత్తమ ప్రదర్శన కనిపిస్తుండగా.. రెండో స్థానాన్ని ప్రైవేటు బడుల విద్యార్థులు ఆక్రమించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే బడుల విద్యార్థులు మూడోస్థానంలో నిలిచారు.
ఆయా తరగతుల విద్యార్థులకు భాషలు, గణితంలో పరీక్షలు నిర్వహించగా.. గణితంలో సగటున 46%, భాషల్లో 57% స్కోర్ రావడం గమనార్హం..! పర్యావరణంపై నిర్వహించిన పరీక్షలోనూ 49% స్కోరుతో విద్యార్థులు వెనకబడే ఉన్నారు.
మూడో తరగతిలో.. గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. ఆరు, తొమ్మిది తరగతుల్లో మాత్రం.. పట్టణ ప్రాంతాల విద్యార్థులు ముందంజలో ఉంటున్నారు.
ప్రత్యేక కార్యాచరణ: కేంద్రం
పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్-2024 ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్ తెలిపారు. ’’ఈ సర్వే ఫలితాలు కేంద్ర, ప్రాంతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో విద్యార్థుల పనితీరుకు నిదర్శనంగా ఉన్నాయి. పరిస్థితిని గాడిలో పెట్టేందుకు పరాఖ్ ద్వారా జిల్లా స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. జాతీయ ప్రతిభ సర్వేక్షణ్(ఎన్‌ఏఎస్) పేరుతో గతంలో 3, 5, 8తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాం. ఈ పరీక్షలు మూడేళ్లకోసారి జరుగుతాయి. చివరిసారి పరీక్షలు 2021లో జరిగాయి. తాజా సర్వే నేపథ్యంలో ఈ పరీక్షలపై దృష్టి పెడతాం’’ అన్నారు.