తగ్గిన గ్రామీణ పేదరికం
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:53 AM
ప్రభుత్వ సంక్షేమ చర్యల కారణంగా దేశంలో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గిందని ఎస్‌బీఐ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

2012లో 25.7%.. ప్రస్తుతం 4.86ు
ఎస్‌బీఐ పరిశోధన పత్రం వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 3: ప్రభుత్వ సంక్షేమ చర్యల కారణంగా దేశంలో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గిందని ఎస్‌బీఐ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2011-12లో 25.7 శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం 2024 మార్చి నాటికి 4.86 శాతానికి తగ్గిపోయిందని, ఇదే కాలవ్యవధిలో పట్టణ పేదరికం 13.7 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గిందని ఈ అధ్యయనం తెలిపింది. తాజా (2023-24) అంచనాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖను రూ.1,632గా, పట్టణ ప్రాంతాల్లో రూ.1,944గా నిర్ణయించినట్లు వెల్లడించింది (ఒక వ్యక్తి కనీస అవసరాలు తీరటానికి నెలకు అయ్యే సగటు ఖర్చునే దారిద్య్రరేఖగా నిర్ణయిస్తారు). ఈ మేరకు ఎస్‌బీఐ శుక్రవారం ఒక పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. 2021 జనాభా లెక్కలు పూర్తయితే ఈ గణాంకాలపై మరింత స్పష్టత వస్తుందని, ముఖ్యంగా పట్టణ పేదరికం మరింత తగ్గినట్టు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ సర్వే తెలిపింది. ప్రత్యక్ష నగదు బదిలీ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు, గ్రామీణ జీవన ప్రమాణాల్లో మెరుగుదల వంటి వాటి వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించింది.