Sathya sai Gramam: సత్యసాయి గ్రామంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్.. పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడు
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:58 PM
సత్యసాయి గ్రామంలో జరుగుతున్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫెస్టివల్ కార్యక్రమానికి ఫిజీ అధ్యక్షుడు హాజరయ్యారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని 100 దేశాలు ఒక్కతాటిపైకి రావడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సేవ, మానవత్వం, ఐక్యతకు ఇది నిదర్శనమని అన్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కర్ణాటకలోగల సత్యసాయి గ్రామంలో మానవత్వం, ఐక్యత చాటేలా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతోంది. ఆగస్టు 16న మొదలైన ఈ కార్యక్రమం 100 రోజుల పాటు జరగనుంది. ఈ క్రమంలో నవంబర్ 17న జరిగిన వేడుకకు ఫిజీ అధ్యక్షుడు రటు నైకామా, ఆయన సతీమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి నిర్వాహకులు ఫిజీ సంప్రదాయక ఇటవుకే పద్ధతిలో స్వాగతం పలికారు. ఫిజీతో పాటు ఇతర దక్షిణ పసిఫిక్ ద్వీప దేశాలు, భారత్ మధ్య స్నేహబంధాన్ని గుర్తుకుతేచ్చేలా ఈ ఈవెంట్ సాగింది. ప్రజల మధ్య ఐక్యత చాటేలా 100 దేశాల వారు పాల్గొన్న ఈ ఈవెంట్‌పై ఫిజీ అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ప్రేమ, సేవ, ఐక్యతకు ఇది నిదర్శనమని అన్నారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న సాయి ప్రేమ ఫౌండేషన్, శ్రీ సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ ఆసుపత్రిని కూడా అభినందించారు. హెల్త్ కేర్ రంగంలో వాణిజ్య పోకడలను తొలగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సత్యసాయి గ్రామంలో ప్రపంచస్థాయి వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందిస్తున్న తీరు అత్యుత్తమ మానవసేవ అని కొనియాడారు. అభివృద్ధి చెందిన దేశాలకు ఈ విధానం స్ఫూర్తిని ఇస్తుందని వ్యాఖ్యానించారు. లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. ఈ దిశగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయికి అన్ని సహాయసహకారాలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఇక సద్గురు మధుసూదన్ సాయి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఫిజీ ప్రభుత్వం ఆయనకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీతో సత్కరించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తరువాత ఈ పురస్కారం అందుకున్న వ్యక్తి సద్గురు మధుసూదన్ సాయి. ఇక నవంబర్ 23న జరగనున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో కూడా ఫిజీ అధ్యక్షులు పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి...
రాష్ట్రపతిని కలువనున్న మందకృష్ణ.. ఎందుకంటే
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవు
Read Latest National News And Telugu News