S-500 Air Defense System: రష్యా మరో ఆఫర్.. భారత్‌కు ఎస్-500
ABN , Publish Date - May 12 , 2025 | 06:40 PM
పాక్ దాడుల్ని తిప్పికొట్టిన ఎస్-400 కంటే శక్తిమంతమైన ఎస్-500 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా భారత్‌కు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత గగనతల రక్షణ వ్యవస్థకు ఎస్-400 సిస్టమ్ కీలకంగా మారింది. పాక్ ప్రయోగించిన మిసైళ్లు, మొదలు అనేక గగనతల దాడులను ఎస్-400 సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే, ఇంతకు మించిన సామర్థ్యం గల ఎస్-500 క్షిపణి విధ్వంసక వ్యవస్థను కూడా అందించేందుకు రష్యా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దేశీయంగా వీటిని తయారు చేద్దామని ప్రతిపాదించినట్టు సమాచారం.
ఏమిటీ ఎస్-500
ఎస్-400 కంటే ఎక్కువ సామర్థ్యంతో ఎస్-500ను రూపొందించారు.. నిపుణులు చెప్పేదాని ప్రకారం, బహుళ దశలు కలిగిన ఈ వ్యవస్థ శత్రుదేశ అస్త్రాలను ధ్వంసం చేయగలదు. అటు అంతరిక్షంలోని టార్గెట్స్ కూడా ధ్వంసం చేయగలదు. భూవాతావరణంలో వచ్చే దాదాపు అన్ని రకాల టార్గెట్స్‌ను నాశనం చేయగలిగే సామర్థ్యం దీని సొంతం.
ఫైటర్‌జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, హైపర్‌సానిక్ మిసైల్స్, శత్రుదేశ నిఘా శాటిలైట్స్‌ను కూడా తుత్తునియలు చేయగలదు. భూఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల పైన ఉన్న టార్గెట్స్‌ను కూడా నాశనం చేయగలిగే సామర్థ్యం దీని సొంతం. మొత్తం 600 కిలోమీటర్ల పరిధిలోని శత్రుదేశ మిసైళ్లు మొదలు విమానాల వరకూ ఏవీ దీని ధాటి ముందు నిలువలేవు. మాక్ 20 వేగంతో వస్తున్న 10 టార్గెట్స్‌ను ఏకకాలంలో ధ్వంసం చేయగల సత్తా దీనికి ఉంది.
ఎస్-500ను అల్మాజ్ ఆంటే సంస్థ డిజైన్ చేసింది. 2021లో దీన్ని రష్యా అంతరిక్ష భద్రతా దళంలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన తొలి రెజిమెంట్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఒక వేళ ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే భారత్ దీన్ని సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు, లద్దాఖ్ అరుణాచల్ ప్రదేశ్‌లతో పాటు తీర ప్రాంతాలై ముంబై, చెన్నై, వైజాగ్ నగరాలకు రక్షణగా మోహరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, పాక్ దాడులను తిప్పి కొట్టేందుకు వీలుగా వీటి మోహరింపు ఉంటుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
ముగిసిన భారత్-పాకిస్థాన్ DGMOల చర్చలు.. ఏం తేల్చారు
పాక్‌కు దొంగదెబ్బే తెలుసు.. నేరుగా ఏ యుద్ధంలోనూ గెలవలేదు
For National News And Telugu News