Share News

సోషలిస్టు, సెక్యులర్‌ పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలి

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:05 AM

రాజ్యాంగ పీఠిక నుంచి సామ్యవాదం (సోషలిస్టు), లౌకికవాదం (సెక్యులరిజం) అనే పదాలను తొలగించాలని ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబోలే అభిప్రాయపడ్డారు.

సోషలిస్టు, సెక్యులర్‌ పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలి

  • సంఘ్‌ నేత దత్తాత్రేయ హోసబలే సూచన

  • దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

  • ఆర్‌ఎస్‌ఎస్‌ ముసుగు తొలగిపోయింది

  • సంఘ్‌, బీజేపీలకు రాజ్యాంగం అక్కర్లే: రాహుల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ పీఠిక నుంచి సామ్యవాదం (సోషలిస్టు), లౌకికవాదం (సెక్యులరిజం) అనే పదాలను తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబోలే అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగ ముసాయిదాలో ఇవి లేవని.. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వీటిని పీఠికలో చేర్చిందని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, సీపీఎం విరుచుకుపడ్డాయి. హోసబోలే గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘బాబాసాహెబ్‌ రాసిన రాజ్యాంగ పీఠికలో ఈ పదాలు ఎప్పుడూ లేవు. ఎమర్జెన్సీ సమయంలో సోషలిస్టు, సెక్యులర్‌ పదాలను పీఠికలో చేర్చారు. అలాగే బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పెద్దఎత్తున చేయించారు. ఇలాంటి పనులు చేసినవాళ్లు ఇప్పుడు రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు. మీ పూర్వీకులు చేసినదానికి క్షమాపణ కోరాల్సిందే’ అని స్పష్టంచేశారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ ముసుగు మళ్లీ తొలగిపోయిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆ సంస్థకు, బీజేపీకి రాజ్యాంగం అవసరం లేదని, వారికి మనుస్మృతి కావాలని ‘ఎక్స్‌’లో మండిపడ్డారు. సమానత్వం, లౌకికవాదం, న్యాయం గురించి రాజ్యాంగం మాట్లాడుతుంది కాబట్టి బీజేపీకి నచ్చడం లేదన్నారు. రాజ్యాంగం వంటి శక్తివంతమైన ఆయుధాన్ని పేదల నుంచి లాక్కోవడమే బీజేపీ నిజమైన ఎజెండాగా పేర్కొన్నారు. అయితే, బీజేపీ కలలను ఎప్పటికీ విజయవంతం కానివ్వబోమని చెప్పారు. హోసబోలే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. అంబేడ్కర్‌ విజన్‌పై ఆర్‌ఎ్‌సఎస్‌ కుట్ర చేస్తోందని ‘ఎక్స్‌’లో విమర్శించింది. పీఠికలో సోషలిస్టు, సెక్యులర్‌ పదాలు ఉంచడంపై సమీక్షించాలనడం రాజ్యాంగ ఆత్మపైనే దాడిగా అభివర్ణించింది. భారత రాజ్యాంగమంటే ఆర్‌ఎ్‌సఎ్‌సకు మొదటి నుంచీ గౌరవం లేదని, దానిని అంగీకరించలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 11:13 AM