Injured Tiger Found: గాయపడ్డ పులి.. రంగంలోకి రెస్క్యూ ఆపరేషన్
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:30 PM
మహారాష్ట్రలోని భండారా జిల్లా ధనోరి గ్రామం సమీపంలోని గోసిఖుర్డ్ ఆనకట్టు కాలువలో తీవ్రంగా గాయపడి ఉన్న పులిని చూసి గ్రామస్థులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. పెద్ద పులిని సురక్షితంగా తరలించి చికిత్స అందించేందుకు పశువైద్య సిబ్బంది రంగంలోకి దిగింది.
మహారాష్ట్ర: భారతదేశంలో ఇటీవల పులుల దాడులు పెరిగిపోతున్నాయి. ఆహారం కోసం గ్రామ శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, పశువులపై దాడులు చేస్తున్నాయి. దీంతో అటవీ శాఖ పులులను బంధించే చర్యలు చేపడుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని భండారా జిల్లా పౌని తహసీల్‌కు చెందిన ధనోరి గ్రామం సమీపంలో గోసిఖుర్డ్ ఆనకట్ట (ఇందిరా సాగర్ ప్రాజెక్ట్) కాలువలో ఈ రోజు (మంగళవారం) తీవ్రంగా గాయపడిన పులిని గ్రామస్థులు గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
అధికారులు వెంటనే స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. విజయవంతంగా పులిని రెస్క్యూ చేశారు. గాయాల కారణం ఇంకా తెలియరాలేదని.. పులి కాలువలోకి జారిపడిందా? దానిపై ఎవరైనా దాడి చేశారా? అన్న విషయం వెటర్నరీ పరీక్ష తర్వాత తెలుస్తుందని అధికారులు తెలిపారు. గాయపడ్డ పులిని నాగ్‌పూర్‌లోని గోరెవాడా రెస్క్యూ సెంటర్‌కు మళ్లించారు. చికిత్స పూర్తయిన తర్వాత అటవీ శాఖ అధికారులు ఆధీనంలోకి తీసుకుంటామని అన్నారు. కాగా, గోసిఖుర్డ్ ఆనకట్ట ప్రాంతం అటవీ ప్రదేశాలకు సమీపంలో ఉండటంతో తరుచూ అక్కడ పులులు సంచరిస్తుంటాయి. ఈ ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. పులి గాయపడి ఉండటం స్థానికంగా కలకలం రేపుతుంది.