Red Alert in Mumbai: ముంబైలో రెడ్ అలర్ట్
ABN , Publish Date - Aug 19 , 2025 | 02:21 AM
భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ముంబైతోపాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ...
భారీ వర్షాలతో నగరం అతలాకుతలం
రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం
నాందేడ్ జిల్లాలో ఐదుగురు గల్లంతు
ముంబై, ఆగస్టు 18: భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ముంబైతోపాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వానల కారణంగా నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకాలో ఐదుగురు గల్లంతయ్యారు. 200 మందికిపైగా వరదల్లో చిక్కుకుపోయారు. ముంబైలో సోమవారం 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై, ఠాణె, రాయగడ్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్డ్ జారీచేసింది. దీంతో అధికారులు సోమవారం మధ్యాహ్నం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మూడు రోజులుగా కురుస్తున్న వానలకు ముంబైలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించక అనేక విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున షెడ్యూల్ సమయం కంటే కాస్త ముందుగానే విమానాశ్రయాలకు చేరుకోవాలని ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీచేశాయి. విమానాశ్రయానికి బయల్దేరే ముందు తమ వెబ్‌సైట్‌లో విమాన సర్వీసులకు సంబంధించిన వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించాయి. అత్యవసరమైతే తప్ప పౌరులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విజ్ఞప్తి చేసింది. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.