Share News

Rajnath Singh Criticizes Trump: భారత వృద్ధిని ఓర్వడం లేదు

ABN , Publish Date - Aug 11 , 2025 | 03:00 AM

తామే అందరికీ బాస్‌ అనుకునేవారు భారత వృద్ధిని ఓర్వడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను

Rajnath Singh Criticizes Trump: భారత వృద్ధిని ఓర్వడం లేదు

  • భారత్‌ సూపర్‌ పవర్‌గా మారడాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు

  • ట్రంప్‌ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శలు

  • రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని వెల్లడి

భోపాల్‌, ఆగస్టు 10: తామే అందరికీ బాస్‌ అనుకునేవారు భారత వృద్ధిని ఓర్వడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా భారత్‌ సూపర్‌ పవర్‌గా మారడాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రైల్వే ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ మాట్లాడారు. ‘‘భారతదేశం అభివృద్ధి చెందుతుండటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరికీ తాను బాస్‌ అనుకునేవారు.. భారత్‌ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోందని ఆశ్చర్యపోతారు. భారత్‌లో తయారయ్యే ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాటి ధర పెరిగిపోయేలా చేయడంపైనే దృష్టిపెడతారు..’’ అని ట్రంప్‌ను ఉద్దేశించి విమర్శించారు. కానీ ఇప్పుడు భారత్‌ అభివృద్ధి చెందుతున్న వేగాన్ని చూస్తే.. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్‌ సూపర్‌ పవర్‌ కాకుండా ఆపలేరని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఒకప్పుడు ఆయుధాలు, ఇతర రక్షణ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడేవారమని, ఇప్పుడు రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించామని తెలిపారు. మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయన్నారు. మోదీ ప్రధాని అయిన సమయంలో భారత రక్షణ ఎగుమతులు రూ.600 కోట్లు అయితే.. ఇప్పుడు రూ.24 వేల కోట్లు దాటాయని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2014లో 11వ స్థానంలో ఉన్న భారత్‌.. ఇప్పుడు నాలుగో స్థానానికి చేరిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, భారత్‌పై అడ్డగోలు సుంకాలతో అమెరికా వ్యవహరిస్తున్న తీరును కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తప్పుబట్టారు. ‘‘కొన్ని దేశాలు ఆర్థిక బలంతో, వారివద్ద ఉన్న ఆధునిక సాంకేతికతలను చూసుకుని ఇతర దేశాలపై దాదాగిరీ చేస్తాయి. అదే మన దేశం అంతకన్నా మంచి టెక్నాలజీలు, వనరులు సమకూర్చుకున్నా.. ఎవరిపైనా దాదాగిరీ చేయదు. ఎందుకంటే ప్రపంచమంతా క్షేమంగా ఉండాలనేది మన సంస్కృతి మనకు నేర్పింది..’’ అని గడ్కరీ పేర్కొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 03:00 AM