Rajasthan floods: రాజస్థాన్‌ను ముంచెత్తిన వరదలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:07 AM
రాజస్థాన్‌ను వాన ముంచెత్తింది. తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలతో 19 జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. సుర్వాల్ డ్యామ్ ఉప్పొంగడంతో
వేర్వేరు ఘటనల్లో నలుగురు చిన్నారులు సహా ఆరుగురి మృతి
జైపూర్/న్యూఢిల్లీ, ఆగస్టు 25: రాజస్థాన్‌ను వాన ముంచెత్తింది. తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలతో 19 జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. సుర్వాల్ డ్యామ్ ఉప్పొంగడంతో.. జదావతా అనే గ్రామంలో నేల తీవ్రంగా కోతకు గురై, 2 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతుతో బిలం ఏర్పడింది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా అంతటా వరద ఉధృతి కనిపించింది. జైపూర్‌లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. రహదారులు చెరువులను తలపించాయి. పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయి.. ప్రజలు ఆకలికేకలు పెడుతున్నారు. సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ బృందం(ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ), ఎస్‌డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఉదయ్‌పూర్‌లోని వర్జిన్ గనుల్లో ఆదివారం వరదనీరు చేరి.. 14 ఏళ్ల వయసున్న లక్ష్మీ గమేటీ, భవేశ్, 12 ఏళ్ల వయసున్న రాహుల్, శంకర్ అనే చిన్నారులు.. నౌగోర్‌లో ఇల్లు కూలిన ఘటనతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. సుర్వాల్‌లోని అజ్నోటీ గ్రామం వద్ద ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బందిని తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడడంతో.. ఓ యువకుడు మృతిచెందాడు.
ఝలావర్ జిల్లాలో ముగ్గురు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వీరంతా మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. సోమవారం ఉదయానికి(గడిచిన 24 గంటల్లో) నౌగోర్ జిల్లాలో అత్యధికంగా 17.3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లోనే రాజస్థాన్‌లో ఇదే అత్యధిక వర్షపాతమని వివరించారు. 1975 తర్వాత రాజస్థాన్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించారు. మరో మూడ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ/అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు, ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని ఐఐఎంలో భారీగా వరద నీరు చేరింది. క్యాంప్‌సలోని నాలుగు బ్లాకుల్లో గ్రౌండ్‌ఫ్లోర్లు పూర్తిగా నీట మునిగాయి. విద్యార్థులు పైఅంతస్తుల్లో నిలబడి హాహాకారాలు చేసే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.