Auto Driver To Luxury Car Owner: ఒకప్పుడు ఆటో డ్రైవర్.. ఇప్పుడు నెంబర్ ప్లేట్ కోసం 32 లక్షలు ఖర్చు..
ABN , Publish Date - Nov 05 , 2025 | 07:57 PM
తినడానికి సరిగా తిండిలేని కుటుంబంలో పుట్టిన ఆ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి కోటీశ్వరుడు అయ్యాడు. ఒకప్పుడు ఆటో నడిపిన వ్యక్తి ఇప్పుడు కోట్లు పెట్టి కార్లు కొంటున్నాడు. అంతేకాదు.. లక్షలు పోసి కార్ల కోసం వీఐపీ నెంబర్ ప్లేట్లు తీసుకుంటున్నాడు.
‘ఎక్కు తొలిమెట్టు .. కొండను కొట్టూ ఢీకొట్టు’ అని నరసింహ సినిమాలో ఓ పాట ఉంటుంది. ఆ పాట పూర్తయ్యేలోగా రజనీకాంత్ మల్టీ బిలియనీర్ అయిపోతాడు. నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అంటే జరుగుతుంది. కానీ, దానికి కొన్నేళ్ల శ్రమ కావాలి. గట్టిగా అనుకుంటే హోటల్‌లో సర్వర్ కూడా కోటీశ్వరుడు కావచ్చు. ఇందుకు రాజస్తాన్‌కు చెందిన రాహుల్ తనేజానే ఓ ప్రత్యక్ష ఉదాహరణ. రాహుల్ మధ్య ప్రదేశ్, మండ్ల జిల్లాలోని కంత్ర అనే చిన్న గ్రామంలో పుట్టాడు.
అతడిది నిరుపేద కుటుంబం. తండ్రి సైకిల్ రిపేర్ షాపు నడిపేవాడు. తల్లి పొలాల్లో కూలీ పనులు చేసేది. రాహుల్ 11 ఏళ్ల వయసులోనే పని చేయటం మొదలెట్టాడు. జైపూర్‌లోని ఓ డాభాలో సర్వర్‌గా పని చేశాడు. మకర్ సంక్రాంతి, దీపావళి, హోళీ పండుగలకు రంగులు, గాలి పటాలు అమ్మేవాడు. ఐదేళ్లలో చాలా రకాల పనులు చేశాడు. 16 ఏళ్ల వయసులో ఆటో నడిపాడు. 19 ఏళ్ల వయసులో కాల్ డీలర్ షిప్ తీసుకున్నాడు.

అదే సమయంలో మోడలింగ్ కూడా మొదలెట్టాడు. మిస్టర్ జైపూర్, మిస్టర్ రాజస్తాన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. 2000 సంవత్సరంలో లైవ్ క్రియేషన్స్ అనే కంపెనీ, 2005లో ఇండియన్ ఆర్టిస్ట్ డాట్ కామ్ స్టార్ట్ చేశాడు. తను అడుగుపెట్టిన ప్రతీ రంగంలో విజయం దక్కింది. కోట్లు సంపాదించాడు. రాహుల్‌కు లగ్జరీ కార్లన్నా, ఫ్యాన్సీ నెంబర్లు అన్నా పిచ్చి. 2011లో తన బీఎమ్‌డబ్ల్యూ కారు నెంబర్ ప్లేట్ కోసం 10 లక్షలు ఖర్చు పెట్టాడు.
2018లో జాగ్వార్ కారు నెంబర్ ప్లేట్ కోసం 16 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు తన కొడుకు కోసం కొన్న ఆడీ కారు నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా 32 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆ కారును తన కొడుకు 18వ పుట్టిన రోజు నాడు గిఫ్ట్‌గా ఇవ్వనున్నాడు. రాహుల్ కొడుకు రేహాన్ పుట్టిన రోజు నవంబర్ 16వ తేదీన ఘనంగా జరగనుంది. పుట్టిన రోజు గిఫ్ట్‌గా కారును, కారుతో పాటు ‘ఆర్జే 60 సీఎం 1’ వీఐపీ నెంబర్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
హెచ్ఏఎం అభ్యర్థి జ్యోతి మాంఝీపై రాళ్ల దాడి
ఈ పక్షిని పట్టుకోవడం చాలా కష్టం.. రోడ్డు మీద ఎంత వేగంగా పరిగెత్తిందో చూడండి..