Share News

Rahul Gandhi: ఓట్ల చోరీపై.. త్వరలోనే హైడ్రోజన్‌ బాంబు!

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:06 AM

ఓట్ల చోరీకి సంబంధించి ‘హైడ్రోజన్‌ బాంబు’లాంటి వివరాలను బయటపెట్టబోతున్నామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. అవి చూశాక ప్రధాని మోదీ దేశానికి ముఖం చూపంచలేరని అన్నారు.

Rahul Gandhi: ఓట్ల చోరీపై.. త్వరలోనే హైడ్రోజన్‌ బాంబు!
MP Rahul Gandhi

  • మేం బయటపెట్టే వివరాలతో మోదీ ముఖం చూపలేరు

  • బీజేపీ వాళ్లు ఇందుకు సిద్ధంగా ఉండాలి: రాహుల్‌

  • బిహార్‌ సీఎం నితీశ్‌ అవినీతి భీష్ముడు: తేజస్వీ యాదవ్‌

  • పట్నాలో ముగిసిన ‘ఓటర్‌ అధికార యాత్ర’

పట్నా, సెప్టెంబరు 1: ఓట్ల చోరీకి సంబంధించి ‘హైడ్రోజన్‌ బాంబు’లాంటి వివరాలను బయటపెట్టబోతున్నామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. అవి చూశాక ప్రధాని మోదీ దేశానికి ముఖం చూపంచలేరని అన్నారు. బిహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా గత నెల 16న ఆయన ససారంలో ప్రారంభించిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ సోమవారం పట్నాలో ముగిసింది. 16 రోజుల పాటు 25 జిల్లాల్లోని 110 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 1,300 కిమీ మేర ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా పట్నాలో ఇండీ కూటమికి చెందిన బిహార్‌ మహాగఠ్‌బంధన్‌ నేతలు ‘గాంధీ సే అంబేడ్కర్‌’ ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు వారిని మార్గమధ్యంలోనే డాక్‌ బంగళా వద్ద ఆపేశారు. అక్కడే గుమిగూడిన ప్రజలనుద్దేశించి రాహుల్‌ ప్రసంగించారు.

బిహార్‌ విప్లవ రాష్ట్రమని.. ఓట్ల చోరీని అనుమతించబోమని దేశానికి సందేశం ఇచ్చిందని స్పష్టంచేశారు. మహాత్మాగాంధీని చంపిన శక్తులు రాజ్యాంగాన్ని హత్యచేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. దీనిని తాము అనుమతించబోమని.. అందుకే యాత్ర చేపట్టామని తెలిపారు. ‘దీనికి అద్భుత స్పందన వచ్చింది. ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ‘ఓట్ల దొంగల్లారా.. గద్దె దిగండి’ అని నినదించారు. బీజేపీ వాళ్లు మాకు నల్లజెండాలు చూపారు. వారికో విషయం చెబుతున్నా.. జాగ్రత్తగా వినాలి. ఆటం బాంబు కంటే హైడ్రోజన్‌ బాంబు పెద్దగా ఉంటుందని మీకు తెలుసా? మహదేవ్‌పురాలో ఆటంబాంబు చూపించాం.

ఇప్పుడు హైడ్రోజన్‌ బాంబుకు సిద్ధంగా ఉండండి. మీ ఓట్ల చోరీ వాస్తవాన్ని ప్రజలు త్వరలో తెలుసుకోబోతున్నారు’ అని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ కలిసి బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ను చెత్తకుప్పలో పారేస్తాయని అన్నారు. ఒకప్పుడు సోషలిజం గురించి మాట్లాడిన ఆయన.. ఇప్పుడు వాటి ఒడిలో కూర్చున్నారని ఎద్దేవాచేశారు. నితీశ్‌ అవినీతిలో భీష్మపితామహుడిలా మారారని ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌ ధ్వజమెత్తారు. నితీశ్‌ మానసిక స్థితి సరిగా లేదని.. ఆయనకు ఎలాంటి విజన్‌ లేదని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని తొలగిస్తారని చెప్పారు.

బిహార్లో ఎస్‌ఐఆర్‌ చేపట్టడం ద్వారా ప్రధాని మోదీ, అమిత్‌షా ఈసీ సాయంతో ప్రజాస్వామ్యాన్ని తుడిచిపెట్టేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జార్ఖండ్‌ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌, వీఐపీ చీఫ్‌ ముకేశ్‌ సహానీ, సీపీఐ-ఎంల్‌ లిబరేషన్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శులు దీపాంకర్‌ భట్టాచార్య, ఎంఏ బేబీ, సీపీఐ నాయకురాలు అనీ రాజా, ఉద్ధవ్‌ సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తదితరులు పాల్గొన్నారు.


ఓటర్లను అవమానిస్తున్నారు

రాహుల్‌గాంధీ ‘హైడ్రోజన్‌ బాంబు’ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. ఆయన దురహంకారంతో ఓటర్లను అవమానిస్తున్నారని.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాను దిగజారుస్తున్నారని ధ్వజమెత్తింది. గతంలో ఆయన వేస్తానని చెప్పిన అణు బాంబు తుస్సుమందని బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ సోమవారం ఢిల్లీలో ఎద్దేవాచేశారు. ‘బీజేపీ ఘనవిజయాలకు మోసం, ఓట్ల చోరీ కారణమని అనడం ద్వారా కాంగ్రెస్‌ అగ్ర నేత ఈ దేశ ఓటర్లనే అవమానిస్తున్నారు. ఇది దురహంకారం. ఇందుకు గాను ఆయన్ను శిక్షించాలని ఓటర్లను అభ్యర్థిస్తాం’ అన్నారు. రాహుల్‌ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని.. ఎన్నికలకు, అణుబాంబు, హైడ్రోజన్‌ బాంబుకు సంబంధమేంటని ప్రశ్నించారు. బిహార్లో కాంగ్రె్‌సకు రాజకీయ మూలాలు లేకపోయినా.. ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌ రాహుల్‌కు సెకండ్‌ ఫిడేలుగా మారారని అన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 08:14 AM