Rahul Gandhi Praises Gen Z: ఓట్ల చోరీని.. భారత జెన్ జీ అడ్డుకుంటుంది
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:32 AM
భారత్‌లోనూ జెన్-జీ ఓట్ల చోరీని అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపింది. ఓట్ల దొంగలను...
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని యువత, విద్యార్థులే కాపాడుకుంటారు
వారి పోరాటానికి అండగా ఉంటా: రాహుల్.. ఇది అంతర్యుద్ధాన్ని ప్రేరేపించడమే: బీజేపీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: భారత్‌లోనూ జెన్-జీ ఓట్ల చోరీని అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపింది. ఓట్ల దొంగలను ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ రక్షిస్తున్నారని గురువారం ప్రత్యక్ష దాడికి దిగిన ఆయన.. ఓట్ల చోరీని అడ్డుకోవాలని 2000వ సంవత్సరం దరిదాపుల్లో జన్మించిన విద్యార్థులు, జెన్-జీకి శుక్రవారం ‘ఎక్స్’లో పిలుపిచ్చారు. ‘ఈ దేశ యువత, ఈ దేశ విద్యార్థులు.. ఈ దేశ జెన్-జీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు. ఓట్ల చోరీని అడ్డుకుంటారు. నేనెప్పుడూ వారికి అండగా నిలుస్తా’ అని తెలిపారు. నేపాల్లో జెన్-జీ చేపట్టిన ఉద్యమం హింసాత్మకం కావడం.. 50 మందికిపైగా విద్యార్థులు మరణించడం.. తదనంతర పరిణామాల్లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలడం తెలిసిందే. రాహుల్ జెన్-జీ ప్రస్తావన తేవడంపై బీజేపీ మండిపడింది. ఇది నేపాల్ తరహా సంక్షోభాన్ని రెచ్చగొట్టడమేనని బీజేపీ ఽఎంపీ నిశికాంత్ దూబే ‘ఎక్స్’లో విమర్శించారు. ‘భారత జెన్-జీ.. కుటుంబ రాజకీయాలకు, అవినీతికి, సైద్ధాంతిక అస్పష్టతకు వ్యతిరేకం. అనువంశిక రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీని చూసినవారు రాహుల్‌ను ఏ విధంగా భరిస్తారు? అవినీతికి వ్యతిరేకులైన యువత మిమ్మల్ని తరిమికొట్టకుండా ఉంటారా? జెన్-జీలో ఆగ్రహం పెల్లుబికితే ఈ దేశం వదిలి వెళ్లిపోవడానికి రాహుల్ సిద్ధంగా ఉండాలి. బంగ్లాదేశ్‌లో ఆందోళనకు దిగినవారు ఇస్లామిక్ రాజ్యం కోరుకుంటున్నారు. నేపాల్ యువత హిందూ రాజ్యం అడుగుతున్నారు. భారత్‌నూ వారు హిందూరాజ్యంగా మార్చవచ్చు. దేశం వీడిపోవడానికి రాహుల్ సన్నాహాలు చేసుకోవాలి’ అని స్పష్టంచేశారు. అంతర్యుద్ధం రావాలని ఆయన కోరుకుంటున్నారని.. దేశాన్ని చీల్చడానికి సొరొస్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ ఆయనపై మండిపడ్డారు. రాహుల్ ‘అర్బన్ నక్సల్’ అని.. దేశంలో అంతర్యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రజలు కాంగ్రె్‌సను ఎన్నుకోకపోతుండడంతో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో అధికారంలోకి రావాలన్నది రాహుల్ ఆలోచనగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ మండిపడ్డారు. ‘ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. రాహుల్‌ను ప్రజలెన్నుకోకపోవడం మా తప్పా? భారత్‌ను నేపాల్, బంగ్లాదేశ్‌లతో పోల్చుతూ చెత్త ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి మనస్తత్వాలను భారతీయులు అంగీకరించరు. అరాచకం సృష్టించడానికి ఆయన ఇచ్చిన పిలుపును ప్రజలు ఆమోదించరు’ అని స్పష్టంచేశారు.
ఈసీ.. చునావ్ కీ చౌకీదార్: రాహుల్
ఈసీపై రాహుల్ మళ్లీ ఆరోపణలకు దిగారు. దానిని ‘చునావ్ కీ చౌకీదార్ (ఎలక్షన్ వాచ్‌మన్)’గా అభివర్ణించారు. ‘వేకువన 4 గంటలకు నిద్ర లేస్తారు.. 36 సెకన్లలో రెండు ఓట్లు తొలగిస్తారు.. తర్వాత మళ్లీ నిద్రపోతారు.. ఓట్ల చోరీ జరుగుతున్నది ఇలాగే. చునావ్ కీ చౌకీదార్ మెలకువగానే ఉంటారు. ఓట్ల దొంగతనాన్ని చూస్తూనే ఉంటారు.. మళ్లీ దొంగలనే కాపాడుతుంటారు’ అని శుక్రవారం ‘ఎక్స్’లో ధ్వజమెత్తారు. ఓట్ల దొంగతనం ఎలా జరుగుతోందో గురువారం తాను చెప్పిన 36 సెకన్ల వీడియోను ఈ సందర్భంగా ఆయన షేర్ చేశారు.