Rahul Gandhi: మోదీ జీ సమాధానం చెప్పండి.. ట్రంప్ కామెంట్స్‌పై రాహుల్ గాంధీ స్పందన
ABN , Publish Date - Jul 19 , 2025 | 10:57 PM
భారత్, పాక్ ఉద్రిక్తతల సందర్భంగా నాలుగు ఐదు జెట్స్ కూలి ఉంటాయంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ విషయంలో సమాధానం చెప్పాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాక్ ఉద్రిక్తతల సందర్భంగా ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఈ విషయమై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ఎక్స్ వేదికగా ప్రశ్నలను సంధించారు. ‘మోదీ జీ.. ఐదు జెట్‌లు కూలిపోయాయా.. ఇందులో నిజమెంత. దేశానికి నిజం తెలియాలి’ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ట్రంప్ వీడియోను కూడా జత చేశారు.
రిపబ్లికన్ పార్టీ సెనెటర్‌ల కోసం శుక్రవారం శ్వేత సౌధంలో ఏర్పాటు చేసిన అధికారిక విందులో ట్రంప్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన తెచ్చారు. ‘భారత్, పాక్‌లు తలపడ్డాయి. నాలుగో ఐదో యుద్ధ విమానాలు కూలిపోయాయి. నాకు తెలిసి ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయి. పరిస్థితి ముదిరిపోయింది’ అని అన్నారు. అయితే, కూలినవి పాక్ యుద్ధ విమానాలా లేక భారత యుద్ధ విమానాల అన్న విషయంలో మాత్రం ఆయన స్పష్టతను ఇవ్వలేదు.
‘యుద్ధం తీవ్రమయ్యేలా కనిపించింది. ఈ రెండూ అణ్వాయుధాలున్న దేశాలు. పరస్పరం దాడులకు దిగాయి. పరిస్థితి అంతకంతకూ సీరియస్‌గా మారింది. కానీ వాణిజ్యంతో సమస్యను పరిష్కరించాము’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జయ్‌రామ్ రమేశ్ స్పందిస్తూ ట్రంప్ మిసైల్ మరోసారి వచ్చిపడిందని వ్యాఖ్యానించారు. ‘ప్రధానికి ట్రంప్‌తో స్నేహం ఉంది. కానీ గత 70 రోజులుగా ట్రంప్ చెబుతున్న విషయాలపై ప్రధాని పార్లమెంటు సమావేశాల్లో స్పష్టతను ఇవ్వాలి’ అని అన్నారు. పాక్, భారత్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై పూర్తి వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రధానిని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఆపరేషన్ సిందూర్ అనంతరం మే 10న భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య తానే సయోధ్య కుదిర్చానని అప్పట్లో ట్రంప్ పేర్కొన్నారు. ఆ తరువాత కూడా పలుమార్లు రాజీకి తానే కారణమని చెప్పుకున్నారు. కానీ భారత్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను తోసి పుచ్చింది. పాక్‌తో వ్యవహారంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని స్వాగతించబోమని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
సుప్రీం కోర్టును ఆశ్రయించిన జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఎంక్వైరీ కమిటీ నివేదిక రద్దుకు విజ్ఞప్తి
నిమిష ప్రియ కేసుపై స్పందించిన విదేశాంగ శాఖ.. ఇది సున్నితమైన అంశమని ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి