Rahul Gandhi Launches Voter Rights Yatra: ఓటు చౌర్యంపై..బిహార్ నుంచి రాహుల్ సమరం
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:06 AM
ఓటు చౌర్యంపై కేంద్ర ప్రభుత్వంతోపాటు.. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)కి వ్యతిరేకంగా గళమెత్తిన కాంగ్రెస్ ..
17 నుంచి ఓటర్ అధికార్ యాత్ర
సెప్టెంబరు 1న పట్నా గాంధీ మైదానంలో ముగింపు
‘ఓటు చౌర్యం’ అనే నీచ పదాన్ని వాడొద్దు: ఈసీఐ
నైరాశ్యంలో రాహుల్ గాంధీ: రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ, ఆగస్టు 14: ‘ఓటు చౌర్యం’పై కేంద్ర ప్రభుత్వంతోపాటు.. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)కి వ్యతిరేకంగా గళమెత్తిన కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. ఈ నెల 17 నుంచి సమర శంఖం పూరించనున్నారు. బిహార్ నుంచి ఆయన ‘ఓటర్ అధికార్ యాత్ర’ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. ‘‘ఓటు చౌర్యం అనేది కేవలం ఎన్నికలకు సంబంధించిన అంశం కాదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ‘ఒక వ్యక్తి-ఒక ఓటు’ సూత్రాన్ని కాపాడే నిర్ణయాత్మక సమరం మాది. ఈ సమరంతో ఓటు దొంగల ఓటమి జరగాలి. ప్రజలు విజయం సాధించాలి. రాజ్యాంగం విజయం సాధించాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 17న ప్రారంభం కానున్న ఓటర్ అధికార్ యాత్ర.. సెప్టెంబరు 1న పట్నాలోని గాంధీ మైదానంలో జరిగే మహాసభతో ముగుస్తుంది. ఈ ఉద్యమాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ నేతలు గురువారం ‘లోక్‌తంత్ర బచావో మషాల్ మార్చ్’, ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 7 వరకు ‘ఓట్ చోర్.. గద్దీ చోర్’ సభలు.. సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 వరకు ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కాగా.. గతవారం రాహుల్ గాంధీ బెంగళూరులోని మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో లక్షకు పైగా ఓట్లు తారుమారయ్యాయంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..! ఇదే అంశంపై విపక్షాలు పార్లమెంట్‌ను అట్టుడికించాయి. మరోవైపు ఈ అంశంపై రాబర్ట్ వాద్రా తీవ్రంగా స్పందించారు. రాహుల్, ప్రియాంక దేశమంతా తిరిగి, ప్రజలకోసం కష్టపడుతున్నారని, ప్రజలు ఈ పోరాటాన్ని గుర్తించకపోతే.. బీజేపీ తప్పుడు మార్గాల్లో గెలుస్తూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రాహుల్ గాంధీ నైరాశ్యంలో ఉన్నారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.
‘ఓటు చౌర్యం’ పదాన్ని వాడొద్దు: ఈసీఐ
‘ఓటు చౌర్యం’ అనే పదాన్ని వాడొద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సూచించింది. ‘‘ఎవరైనా రెండుసార్లు ఓటు వేశారనడానికి ఆధారాలుంటే.. ప్రమాణపత్రంతో సమర్పించండి. అంతేకానీ, ఇలాంటి నీచ పదాన్ని వాడొద్దు’’ అని స్పష్టం చేసింది. 1951 నుంచి ‘ఒక వ్యక్తి - ఒక ఓటు’ చట్టం అమల్లో ఉందని గుర్తుచేసింది. కోట్ల మంది ఓటర్లను, లక్షల మంది ఎన్నికల సిబ్బందిని ‘ఓటు దొంగలు’ అని పిలవడం వారి గౌరవంపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించింది.